iDreamPost
iDreamPost
అంత అన్నాడు ఇంత అన్నాడే దిల్ రాజు.. చివరికి తానే దెబ్బ తిన్నాడే అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు అంటే దిల్ రాజు అని చెప్పొచ్చు. తమిళ స్టార్ విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన వారీసు అనే చిత్రాన్ని నిర్మించాడు. తమిళ్ తో పాటు వారసుడు పేరుతో తెలుగులో కూడా మొదట జనవరి 11నే విడుదల చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు ఉంటే.. వాటికి సరిపడా థియేటర్లు లేకుండా చేసి.. డబ్బింగ్ సినిమా వారసుడి కోసం అత్యధిక థియేటర్లు బ్లాక్ చేశారంటూ దిల్ రాజుపై విమర్శలు వచ్చాయి. ఇది వ్యాపారం అంటూ మొదట్లో వాదించిన దిల్ రాజు.. రోజురోజుకి పెరుగుతున్న వ్యతిరేకత, ఇండస్ట్రీ వారితో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎట్టకేలకు వెనక్కి తగ్గాడు. తమిళ్ వెర్షన్ వారిసు ని 11వ తేదీనే విడుదల చేసి, తెలుగు వెర్షన్ వారసుడు ని మాత్రం 14కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఇప్పుడు దిల్ రాజుకి గట్టి షాక్ ఇచ్చింది అంటున్నారు.
బుధవారం విడుదలైన వారిసు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో విడుదల కానప్పటికీ తమిళ వెర్షన్ రివ్యూలు ఇక్కడా వచ్చేశాయి. ఎక్కువగా సినిమా యావరేజ్, బిలో యావరేజ్ అనే రివ్యూలు వచ్చాయి. అసలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల కారణంగా వారసుడు పై తెలుగు ప్రేక్షకుల దృష్టి లేదు. దానికి తోడు ట్రైలర్ కూడా ఇప్పటికే ఎన్నోసార్లు చూసేసిన పలు తెలుగు సినిమాలను గుర్తుచేసేలా ఉందనే కామెంట్స్ వినిపించాయి. అయినప్పటికీ సంక్రాంతి పండుగ సమయం, పైగా ఫ్యామిలీ ఫిల్మ్ కావడంతో జనవరి 11న విడుదల అయ్యుంటే.. అప్పటికి ఇంకా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ల హంగామా మొదలు అయ్యుండదు కాబట్టి అంతో ఇంతో చెప్పుకోదగ్గ కలెక్షన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలే తెలుగు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు.. దానికితోడు ఇప్పుడు డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ఇప్పుడు అందరూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల సందడిలో మునిగిపోయారు. ఇప్పుడు వేరే సినిమాని పట్టించుకునే పరిస్థితి లేదు. వాటికన్నా ముందు వస్తే చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చేవేమో.. ఇప్పుడసలు కనీస వసూళ్లు రాబట్టే అవకాశం కూడా లేదంటున్నారు.