iDreamPost
iDreamPost
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కావాల్సిన వారసుడుకి చివరి నిమిషం చిక్కులు వచ్చాయని ఫిలిం నగర్ టాక్. తమిళ వెర్షన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం పలు కారణాల వల్ల ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా రిలీజవుతుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. దానికి తగ్గట్టే ఇవాళ దిన పత్రికల్లో ఇచ్చిన థియేటర్ లిస్టు యాడ్ లో డేట్ ఇవ్వకపోవడంతో ఇది నిజమనేందుకు మరింత బలం చేకూరింది. యుఎస్ లో ప్రీమియర్లు పడాలంటే కంటెంట్ డెలివరీ ఈపాటికి జరిగిపోయి ఉండాలి. కానీ వారసుడుకి ఇంకా అవ్వలేదు. ఆ కారణంగానే అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కొత్త డేట్ అంటే 11కి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయకుండా ఎదురు చూస్తున్నారు.
ఈ సమస్య ఇంకో ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారమవ్వాలి. లేదంటే కేవలం వరిసు మాత్రమే రిలీజై ఒక రోజు ఆలస్యంగానో లేదా 14న వారసుడు రావాల్సి ఉంటుంది. దిల్ రాజు విపరీతమైన పనుల్లో తలమునకలై ఉండటంతో మీడియాకు దొరకడం లేదు. ఒకవేళ పోస్ట్ పోన్ లాంటిది ఏదైనా ఉన్నా అది కూడా వీలైనంత త్వరగా ప్రకటించాలి. అజిత్ తెగింపులో ఎలాంటి మార్పు లేదు. ఆల్రెడీ స్క్రీన్ల వారిగా జాబితా వచ్చేసింది. 11న ఒకేసారి రెండు భాషలు వచ్చేస్తాయి. తమిళనాడులో అర్ధరాత్రి 1 గంటకు తునివు ఆ తర్వాత 4 గంటలకు వరిసు అక్కడ రాష్ట్రం మొత్తం మీద ఉన్న థియేటర్లలో ప్రీమియర్లు వేస్తారు. ఆపై రెగ్యులర్ షోలు సమానంగా పంచుకుంటారు.
నిజంగా వారసుడు కనక ఏదైనా ట్విస్టు ఇస్తే అది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే మొదటి రోజు సరిపడా థియేటర్లు ఆంధ్రా తెలంగాణలో దొరుకుతాయి. నైజామ్ లోనే వారసుడుకి ఫస్ట్ డే 200కు పైగా స్క్రీన్లు ఇచ్చారన్న వార్త ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడీ రేస్ నుంచి ఒకటి రెండు రోజులకైనా సరే తప్పుకోవడం కన్ఫర్మ్ అయితే చిరు బాలయ్యలకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. ట్రైలర్ మీద సోషల్ మీడియాలో రొటీన్ అనే ఫీడ్ బ్యాక్ రావడంతో మరో ట్రైలర్ కట్ కోసం వారసుడు టీమ్ ప్లాన్ లో ఉంది. ఈలోగా ఇప్పుడీ ట్విస్టు వచ్చి పడటంతో కొంత అయోమయం నెలకొంది. రేపటిలోగా మొత్తం ఫైనల్ అవుతుంది