బామ్మా మనవడి ఎమోషనల్ సినిమా- Nostalgia

సెంటిమెంట్ ప్లస్ ఎమోషన్ ఈ రెండు అంశాలు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ నే మెప్పిస్తాయనుకుంటే పొరపాటే. సరిగ్గా పండించాలే కానీ క్లాసు మాస్ తేడా లేకుండా అన్ని వర్గాలను ఆకట్టుకునే సత్తా వీటిలో ఉంది. దానికో మంచి ఉదాహరణ వారసుడొచ్చాడు. 1987లో తమిళ్ లో మణివణ్ణన్ దర్శకత్వంలో ‘తీర్త కరైనియిలే’ అనే సినిమా వచ్చింది. మోహన్ రూపిని జంటగా వచ్చిన ఈ మూవీ అక్కడ పెద్ద హిట్టు. దీన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేసే ఉద్దేశంతో హక్కులు కొన్నారు స్రవంతి రవికిశోర్. మొదట రాధ హీరోయిన్ గా వేరే డైరెక్టర్ తో అనుకున్న సినిమా కాస్త అనూహ్యంగా మార్పులు చెంది సుహాసిని కథానాయికగా మోహనగాంధీ దర్శకుడిగా తెరకెక్కింది.

అతడు సినిమా గుర్తుందిగా. చనిపోయిన రాజీవ్ కనకాల స్థానంలో మహేష్ బాబు వాళ్ళ కుటుంబంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతాడు. ఈ పాయింట్ వారసుడొచ్చాడులో తీసుకున్నదే. నిరుద్యోగి అయిన బోస్(వెంకటేష్)ఓ సందర్భంలో ఆసుపత్రిలో టిబి జబ్బుతో బాధ పడుతున్న రఘు(వసంత్)ను కలుస్తాడు. చిన్నప్పుడే పారిపోయిన తన కోసం ఊళ్ళో బామ్మ శేషమ్మ(నిర్మలమ్మ) ఎదురు చూస్తుంటుందని తన బదులుగా అక్కడికి వెళ్ళమని అడుగుతాడు. సరేనన్న బోస్ రఘుగా అక్కడికి చేరుకుంటారు. అక్క మొగుళ్ళ(కోట, గొల్లపూడి)వల్ల గాడి తప్పుతున్న కుటుంబాన్ని చక్కదిద్దుతాడు. ఆ తర్వాత రఘు వస్తాడు.

తర్వాత జరిగేది చూడనివాళ్ళు సినిమాలో చూస్తేనే బాగుటుంది. పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ విలేజ్ డ్రామా తెరకెక్కించిన తీరు వారసుడొచ్చాడుకి మంచి విజయాన్ని అందించింది. ఇళయరాజా పాటలు, తనికెళ్ళ భరణి సంభాషణలు అద్భుతంగా కుదిరాయి. మోహన్ బాబు వెరైటీ విలనీ, తనికెళ్ళ భరణి క్యారెక్టర్ బాగా పండాయి. ముఖ్యంగా బామ్మ మనవడి సెంటిమెంట్ ఆడియన్స్ ని కదిలించింది. ప్రీ క్లైమాక్స్ వ్యవహారం కాస్త శృతి మించినట్టు అనిపించినా ఓవరాల్ గా వెంకీకి మంచి సక్సెస్ ని అందించింది. 1988 అక్టోబర్ 13న రిలీజైన వారసుడొచ్చాడు వెంకటేష్ ని మాస్ కి మరింత దగ్గర చేసింది

Also Read : దొంగల బ్రతుకుల్లో వ్యథకు తెరరూపం – Nostalgia

Show comments