iDreamPost
iDreamPost
దేనికైనా సుడి ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది చాలా అవసరం. శ్రీలీల ఆ సామెతకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. మొదటి చిత్రం సూపర్ ఫ్లాప్ అయినా అవకాశాలకు కొదవ లేకపోవడం అనూహ్యమే. పెళ్లి సందD ద్వారా రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో పరిచయమైన ఈ అమ్మాయి చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రవితేజ ధమాకాలో తనే మెయిన్ హీరోయిన్. సీనియర్ హీరో సరసన జోడి కట్టాల్సి వచ్చినా ఆలోచించకుండా ఓకే చెప్పడం మెచ్చుకోదగ్గ విషయమే. ప్రసన్నకుమార్ రచన చేస్తున్న ఈ మూవీకి నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకులు.
ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలుతో మోస్ట్ వాంటెడ్ లిస్టులోకి చేరిపోయిన నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకుంది. నితిన్ సరసన ఛాన్స్ కొట్టేసింది.అల్లు అర్జున్ నా పేరు సూర్యతో దర్శకుడిగా మారిన రచయిత వక్కంతం వంశీ రెండో సినిమా ఇది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే ఓ కమర్షియల్ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన ఎంపికైనట్టు మరో లేటెస్ట్ అప్ డేట్. ఇవి కాకుండా గాలి జనార్దన్ రెడ్డి వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కూడా తన చేతిలో ఉంది. ఇలా మొత్తం ఆరు సినిమాలతో కెరీర్ బిగినింగే బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుంది.
ఇవన్ని ఒక ఎత్తు అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమాలో ఆఫర్ కొట్టేయడం మరో ఎత్తు. ఆయన సరసన జోడి కాదు కానీ కూతురిగా చేయబోతున్నట్టు వినికిడి. ప్రియమణి తల్లి క్యారెక్టర్ అంటున్నారు. అంటే ఇంకో యూత్ హీరో తనకు పెయిర్ ఉంటాడని అర్థమవుతోంది. ఇవి కాకుండా మరికొన్ని డిస్కషన్ స్టేజి లో ఉన్నాయట. సక్సెస్ ఉంటే తప్ప పలకరింపులు పెద్దగా ఉండని ఇండస్ట్రీలో ఇలా అసలు హిట్టే రాకుండా ఇన్నేసి ఆఫర్స్ పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు పడితే కొత్త జెనరేషన్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న కృతి శెట్టి లాంటి వాళ్ళ సరసన శ్రీలీల కూడా చేరిపోవచ్చు.టైం కలిసివస్తే అంతేమరి