iDreamPost
android-app
ios-app

చైనాకు షాకిచ్చి ట్రంప్ .. విమానాలను నిలిపేశాడు

  • Published Jun 04, 2020 | 3:47 AM Updated Updated Jun 04, 2020 | 3:47 AM
చైనాకు షాకిచ్చి ట్రంప్ .. విమానాలను నిలిపేశాడు

కరోనా వైరస్ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా-డ్రాగన్ దేశం చైనా మధ్య రోజు రోజుకు వివాదాలు ముదిరిపోతున్నాయి. తాజాగా చైనా విమానాలను అమెరికాలోకి అనుమతించకూడదని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16వ తేదీ నుండి చైనా విమానాలను అమెరికాలోకి అనుమతించేది లేదని అమెరికా ప్రభుత్వం చేసిన తాజా ప్రకటన సంచలనంగా మారింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలకన్నా ముందే చైనా లాక్ డౌన్ పాటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమెరికా విమానాలను చైనాలోకి ప్రవేశించకుండా డ్రాగన్ దేశం నిషేధం విదించింది.

చైనా నిర్ణయంతో అప్పట్లో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాలు ఆగిపోయాయి. చైనాలో పరిస్ధితులు చక్కబడిన తర్వాత కూడా చైనా ప్రభుత్వం విమానాలకు అనుమతి ఇవ్వలేదు. దాంతో పై సంస్ధల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. దాంతో పరిస్ధితిని సమీక్షించిన అమెరికా విదేశాంగశాఖ ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్ళారు.

అసలే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనా పై మండిపోతున్న ట్రంప్ వెంటనే నివేదికలను పరిశీలించి చైనాను దెబ్బకు దెబ్బ కొట్టాలని నిర్ణయించాడు. అందుకే చైనాకు చెందిన ఎయిర్ చైనా, చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్, చైనా సదరన్ ఎయిర్ లైన్స్, షియుమెన్ ఎయిర్ లైన్స్ విమానాలను అమెరికా గగనతలంలోకి అనుమతించేది లేదంటూ నిర్ణయించాడు. పైగా అమెరికాకు చెందిన ఎన్ని విమానాలను చైనా తన దేశంలోకి అనుమతిస్తుందో తాము కూడా అన్నే విమానాలను ఇకనుండి అనుమతిస్తామంటూ చేసిన ప్రకటన ఇరు దేశాల్లోను కలకలం రేపుతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమెరికాలోని విదేశీయుల్లో అత్యధికం డ్రాగన్ దేశస్ధులే. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లాడిస్తున్న కాలంలో కూడా చైనా-అమెరికా మధ్య విమానాల రాకపోకలు చాలా స్వేచ్చగా జరిగాయి. దాంతో వైరస్ కారణంగా చైనాలో ఉండలేని చాలామంది అమెరికాకు వచ్చేశారు. దాంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ లాంటి రాష్ట్రాల్లో వైరస్ పెరిగిపోయింది. సరే ఈ విషయాలు ఎలాగున్నా రెండు దేశాల మధ్య వివాదాలు పెరిగిపోతున్న కారణంగా మామూలు జనాలు ఇబ్బందులు పడుతున్నది మాత్రం వాస్తవం.