iDreamPost
iDreamPost
సమయం ఏదైనా సందర్భం ఎలాంటిదైనా , స్థితి అనుకూలమైనా , పరిస్థితులు ప్రతికూలిస్తున్నా అనుక్షణం కంచు కంఠంతో వక్రభాష్యం పలికే ఏబీఎన్ కొత్తపలుకు గొంతుక నిన్న జీరపోయింది ఎందుకు ?
ప్రతి ఆదివారం ఉదయానికి కొత్త ఉత్సాహంతో తనదైన శైలితో ఏ వార్తని అయినా ఏ సందర్భాన్ని అయినా అన్నీ అంతా తానై చూసినట్టు వ్యక్తిగత రహస్యాలు సైతం తనకే తెలిసినట్టు అట , అని సమాచారం , ఆంతరంగిక చర్చలో మాట , విశ్వసనీయ వ్యక్తుల కథనం అంటూ తనకు తనవారలకు అనుకూలంగా వైరి వర్గాల పై పూర్తి వ్యతిరేకతతో కధనాలు వండి వార్చే rk కొత్త పలుకులో నిర్వేదం కనపడింది ఎందుకో .
తాను చట్టానికి , న్యాయ వ్యవస్థలకు అతీతుణ్ణి అని ఇన్నాళ్లు భావించి వ్యవస్థల్ని తృణప్రాయంగా చూసిన rk ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కేసరికి తత్వం బోధ పడిందా .
ఎవరి కాడి అయితే భుజానికెత్తుకొని మోసాడో ఆ టీడీపీ చిత్తుగా ఓడి , రాజధాని భూముల రగడలో ఆర్ధిక మూలాలు చితికిన టీడీపీ ని ఇహ ఎంత మోసినా పైకి లేవదని తెలుసుకొన్నందుకేనా ఈ నిర్వేదం .
కేంద్రం అయినా ఆదుకొంటుందని అమిత్ షా ని కలిసివచ్చి బీజేపీ అనుకూల కధనాలు ఎన్ని వండి వార్చినా టీడీపీ ని ఆదుకునే ప్రయత్నం కాదు కదా ఆ పార్టీ నేతల్ని కలవడానికి కూడా ఇష్టపడక ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పి పంపేసరికి భవిష్యత్తు కళ్ళకి కట్టినట్టు కనపడేసరికి ఎగిరిందా తెల్ల జెండా ..
సహజ కవచ కుండలంలా మారి కాపాడదామని ఎంత యత్నించినా టీడీపీ చక్రంలోని ఆకులాంటి నేతలు ఒక్కొక్కరి అవినీతి అక్రమాలు బయటికి రాలుతుంటే ఇహ ఇరుసు లాంటి తానేమీ చేయలేనని నిర్ణయించుకొన్నాడా .
ఉద్యోగ ధర్మం వీడి అధికార పార్టీ కొమ్ము కాసి అక్రమాలకు పాల్పడ్డాడని ఏబీ వెంకటేశ్వర రావు లాంటి అధికారి పై అభియోగాల్ని నిర్ధారిస్తూ విచారణకు కేంద్రం ఆదేశించేసరికి ముందరి కాళ్లకు బంధాలు పడ్డాయా ?
ఈ రోజు ఆంధ్రజ్యోతిలోని కొత్త పలుకు విన్నవారికి , చదివిన వారికీ ఇవన్నీ నిజం అనిపించకమానవు .
యుద్ధం ముగిసి ఓడిపోయాక కూడా ఓటమిని ఒప్పుకోక కొత్త భాష్యాలు పలికే రాధాకృష్ణ గతవారం చంద్రబాబు ఎన్నికల కోసం పసుపు కుంకుమ అనే పేరుతో ప్రజాధనాన్ని ఎన్నికల తాయిలాలుగా వాడాడని నిజం ఒప్పుకోవటాన్ని గమనిస్తే తెల్లజెండా చూపిస్తున్న సూచన అర్థం కాక మానదు .
ఈ రోజు టీడీపీ పోటీ చేసినా ఓడిపోతుందని అలాంటప్పుడు పోటీ చేయటం అనవసరమని తేల్చేయటం కానీ , ఎవరినైనా కలవాలంటే తన వద్దకే పిలిపించుకొనే ముఖేష్ అంబానీ కూడా తాడేపల్లి వచ్చి జగన్ ని కలిసి రాజ్యసభ సీటు కోసం రిక్వెస్ట్ చేయడం జగన్ స్థాయిని పెంచిందని ఒప్పుకోవడం కానీ చూస్తే భవిష్యత్ చిత్రం ఎదో కళ్ళ ముందు కనపడి తత్వం బోధపడింది అనుకోవచ్చు .
ఏదేమైనా నేటి కొత్తపలుకు టీడీపీలో కాస్తో కూస్తో దృఢంగా నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడే కొద్దిమందికి కూడా నిర్వేదం కలిగించి పోరాటానికి విముఖత కలిగించింది అని చెప్పొచ్చు .
ఎలాంటి సంక్షోభంలో అయినా అవకాశాల్ని వెతుక్కొంటా అని చెప్పుకునే బాబు గారు ఈ అనుకోని అశనిపాతాన్ని ఎలా తట్టుకొంటాడో చూడాలి .