Idream media
Idream media
సస్పెన్స్ థ్రిల్లర్ ను మరిపించే రీతిలో కొనసాగిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఎమ్మెల్సీ ఎంపిక కథ సుఖాంతం అయింది. ఇవాళ (మే 11) మహారాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు పోటీగా ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో మే 27న జరిగే ఎన్నికలలో ఉద్దవ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం లాంఛనప్రాయమే. దీంతో శివసేన పార్టీ వర్గాలు ఆందోళన నుండి బయటపడి సంబరాలలో మునిగి తేలాయి. మిత్రపక్షమైన కాంగ్రెస్ తనకు కేటాయించిన ఒక్క స్థానానికి బదులు ఇద్దరినీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసి బరిలో నిలిపి ఉత్కంఠకు తెరతీసింది.
ఆదివారం మహా వికాస్ అగాఢీలోని మిత్రపక్షాల మధ్య జరిగిన చర్చలతో పాటు, సీఎం ఉద్ధవ్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ఒక అభ్యర్థిని ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఆ రాష్ట్ర ఉభయ సభలలో దేనిలోనూ సభ్యుడు కాదు. అయితే శాసనమండలిలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు గత మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణతో దేశంలో అన్ని రకాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఎమ్మెల్సీగా ఎంపిక అవుదామని ఆశించిన ఉద్ధవ్ ఆశలు నెరవేరలేదు.
ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి మే 28 నాటికి ఆరు నెలలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్ కోటాలో ఉద్ధవ్ ఠాక్రే ను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ ను కోరింది. కానీ గత నెలలో రెండు సార్లు ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని క్యాబినెట్ చేసిన తీర్మానంపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా కాలయాపన చేశాడు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం నేరుగా ప్రధాని మోడీతో తన ఎమ్మెల్సీ ఎంపిక గురించి చర్చించారు. దీంతో గవర్నర్ రాష్ట్ర శాసనమండలిలోని తొమ్మిది ఖాళీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అడ్డంకులు తొలగడంతో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 27న జరిగే మహారాష్ట్ర మండలి ఎన్నికలలో బిజెపి నుంచి నలుగురు, శివసేన ఎన్సీపీ పార్టీల నుండి చెరో ఇద్దరితో పాటు కాంగ్రెస్ నుండి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.