iDreamPost
android-app
ios-app

తాగి ఉన్నారని వదిలేస్తే.. ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్నారు

రోడ్డు ప్రమాదం అంటే ఓ కుటుంబం రోడ్డున పడటం.. ఇది ఓ సినీ రచయిత అన్నమాటే కాదు.. నిజం కూడా. ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్ అంటారు.. కానీ కావాలనే గుద్దితే.. ఇదే జరిగింది మహారాష్ట్రలో.

రోడ్డు ప్రమాదం అంటే ఓ కుటుంబం రోడ్డున పడటం.. ఇది ఓ సినీ రచయిత అన్నమాటే కాదు.. నిజం కూడా. ఈ ప్రమాదాలు అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్ అంటారు.. కానీ కావాలనే గుద్దితే.. ఇదే జరిగింది మహారాష్ట్రలో.

తాగి ఉన్నారని వదిలేస్తే.. ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్నారు

ఇంట్లో నుండి బయటకు వచ్చాక.. సేఫ్‌గా తిరిగి ఇంటికి చేరుకుంటామో, లేదో చెప్పలేం. రెప్పపాటులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలే అందుకు కారణం. ఏ ప్రమాదం ఎటు నుండి పొంచి ఉందో ఊహించలేం. ఇటీవల సంచలనం కలిగించిన పూణె సంఘటన అందుకు ఉదాహరణ. తప్పతాగి.. కారు నడుపుతూ ఇద్దరు టెకీలను బలిగొన్నాడు ఓ మైనర్. ఈ తరహా సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం, నిద్రలేమి, ర్యాంగ్ రూట్లలో వాహనాన్ని నడపటం ఈ ప్రమాదాలకు కారణమౌతున్నాయి. కానీ ఓ కుటుంబం మాత్రం.. కొంత మంది యువకుల ఈగో వల్ల బలైంది. రోడ్డు ప్రమాదంలో భార్య, బిడ్డను కోల్పోవలసి వచ్చింది ఇంటి పెద్ద. ఇంతకు ఏం జరిగిందంటే..?

మహారాష్ట్రలోని లాతూర్‍కు చెందిన సాదిక్ షేక్‌ది అందమైన కుటుంబం. భార్య ఇక్రా, కుమారుడు, కూతురు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న సంసారం. అయితే గత నెల 29న 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లారు సాదిక్ కుటుంబం. బైక్ పై ఆరేళ్ల కుమారుడు అహద్, మూడేళ్ల కూతురు నదియా, భార్యతో కలిసి తిరిగి వస్తున్నాడు. అంతలో వీరి బైక్‌కు అడ్డుగా వచ్చింది కారు. దీంతో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు సాదిక్. ఏం కనిపించడం లేదా అంటూ కారులో ఉన్న యువకుల్ని ప్రశ్నించాడు. యువకులు సైతం రెచ్చిపోయారు. దీంతో తాగి ఉన్నారని నిర్ధారించుకున్న సాదిక్.. వారితో గొడవ ఎందుకులే అనుకుని బయలు దేరాడు. అయితే యువకులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు. ఈగో హర్ట్ అయ్యి వారిని వెంబడించడం మొదలు పెట్టారు. సుమారు 5 కిలోమీటర్ల పాటు వారిని ఛేజింగ్ చేసి అనంతరం కారుతో బైకును ఢీ కొట్టారు.

ఈ ప్రమాదంలో భార్య ఇక్రా, కూతురు నదియా మరణించారు. షేక్, అహద్‌లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి ఆసుపత్రిలో చేర్చారు. తొలుత ఇదంతా రోడ్డు ప్రమాదం అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన తర్వాత సాదిక్ అసలు విషయం చెప్పాడు. కారులో వచ్చిన యువకులు తమను వెంబడించారని, అంతే కాదు మతపరమైన దూషణలకు పాల్పడ్డారని చెప్పాడు. కాగా, కేసు నమోదు చేసేందుకు కూడా పోలీసులు వెనకాడారని తెలుస్తోంది. కొంత మంది పెద్దలు కలుగ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేశారు. ఐదుగురు నిందితులు దిగంభర్ పండోలే, కృష్ణ వాఘ్, బస్వరాజ్ ధోత్రే, మనోజ్ మానే, ముదామెలను అరెస్టు చేసి మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. దురుద్దేశంతోనే ఆ కుటుంబాన్ని వెంటాడి, ఢీ కొట్టినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. కుటుంబంలోని ఇద్దర్ని కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు సాదిక్, అతడి కుటుంబ సభ్యులు.