iDreamPost
android-app
ios-app

ఏపీలో 25 జిల్లాలు..లాభమా..నష్టమా…?

ఏపీలో 25 జిల్లాలు..లాభమా..నష్టమా…?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలొస్తున్నాయ్‌. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణల చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల ఏర్పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారగా… మరోవైపు కొత్తగా 12 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మరో ఐదారు నెలల్లో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికల హామీ

గత ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చీ రాగానే ఎన్నికల హామీల అమల్లో దూకుడుగా వ్యవహరిస్తున్న జగన్‌..కొత్త జిల్లాల ఏర్పాటుకు సై అన్నారు. ఈ మేరకు తగిన కార్యచరణ రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రెవెన్యూ శాఖ 13 జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుంది. ప్రస్తుతం అధికారలు జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల వారీగా ఉన్న జనాభా, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు.

ఐదు ఒకే..మిగిలిన చోటే సమస్యలు

కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో ఐదింటికి ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు. మిగిలిన వాటికి భౌగోళిక, ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సమస్యల్లో కొన్ని…

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్నే తీసుకుంటే..దీని పరిధిలోని సంతనూతలపాడు మండలంలోని పేర్నిమిట్ట ఒంగోలు నగరంలో అంతర్భాగంగా ఉంది. అలాగే గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంటు పరిధిలోని అమరావతి మండలానికి గుంటూరు దగ్గరగా ఉంటుంది. అలాగే అనంతపురం రూరల్‌ మండలం.. హిందూపురం ఎంపీ నియోజకవర్గం పరిధిలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి.

అరకును ఏం చేయాలి?

అరకు పార్లమెంటు నియోజకవర్గానికి భౌగోళికంగా ప్రత్యేక స్థానం ఉంది! ఇది తూర్పు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉంది. కాబట్టి అరకును యథాతథంగా జిల్లాగా చేస్తే భౌగోళికంగా, పరిపాలనా పరంగా అనేక సమస్యలొచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. పైగా అరకు నియోజకవర్గంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. కాబట్టి శాంతిభద్రతల కోణంలోనూ అరకు పార్లమెంటుపై అధికారులు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, మదనపల్లి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉంది. అలాగే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా గోదావరి జిల్లాల పేర్లను కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

ఏపీ జిల్లాల్లో అత్యధిక జనాభా

ఏపీలో జిల్లాల సగటు జనాభా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఒక్క పశ్చిమ బెంగాల్‌ మాత్రమే ఏపీ కంటే ముందుండటం గమనార్హం. బెంగాల్‌లో సగటు జిల్లా జనాభా 42.9 లక్షలు కాగా, ఏపీలో 41.1 లక్షలుగా ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 33.9 లక్షలు, బిహార్‌ 32.2 లక్షలు, యూపీ 31.1 లక్షలు ఉన్నాయి.

తెలంగాణలో మూడింతలు

అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే! అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖరరావు పరిపాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా 10 జిల్లాల తెలంగాణాను 31 జిల్లాలకు విస్తరించారు. ఈ సంవత్సరంలో ప్రారంభంలో ములుగు, నారాయణ్‌పేటలను జిల్లాలుగా చేసి ఆ సంఖ్యను 33కు చేర్చారు. అయితే తెలంగాణలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించి శాస్త్రీయంగా సరైన కసరత్తు జరగలేదనే విమర్శలొచ్చాయి.

కొత్త జిల్లాల ట్రెండ్‌

దేశవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొసాగుతోంది. 1981 నాటికి దేశంలో మొత్తం 412 జిల్లాలు ఉండగా, 2019 నాటికి ఈ సంఖ్య 727కు చేరింది. 2021లో జనాభా లెక్కలు చేపట్టే సమయానికి ఈ సంఖ్య 1000 దాటుతుందని అంచానా. ఈ మధ్యకాలంలో రాష్ట్రాల వారీగా ఏర్పాటైన కొత్త జిల్లాలను పరిశీలిస్తే 2016లో మణిపూర్‌లో తొమ్మిది, 2018లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడు, 2016లో తెలంగాణలో 21(తాజాగా మరో రెండు), 2019, జనవరిలో తమిళనాడులో రెండు(కల్కురిచి, టెంకసి) జిల్లాల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ సైతం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో(2013) కొత్తగా 7 జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం.

అనేక లాభాలు

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు కొత్త జిల్లాలు బాటలు వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు కొత్త జిల్లాలు ఉపయోగపడతాయి. అలాగే కేంద్రం జిల్లాల ప్రాతిపదికన అందించే నిధులు, ఇతరత్రా గ్రాంటులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. తాజాగా ప్రతి జిల్లాలో ఒక వ్యవసాయ రీసెర్చ్‌ సెంటర్, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో సదరు ఫలాలను అందిపుచ్చుకోవచ్చు. అయితే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరిగినప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. లేదంటే అధికార యంత్రాంగం నిరుపయోగంగా మారే ప్రమాదం ఉంటుంది.