Idream media
Idream media
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి ఆ పార్టీని ఓ మెట్టు కిందకు తీసుకురాగా.. బీజేపీని వంద మెట్లు పైకి ఎక్కించింది. రాష్ట్రంలో తమకు ఎదురేలేకుండా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుని ఆ పార్టీని దెబ్బతీశామని టీఆర్‌ఎస్ నేతలు సంబరపడేలోపు.. టీఆర్‌ఎస్‌ను సవాల్ చేసేలా బీజేపీ దూసుకురావడం గులాబీ పార్టీకి మింగుడుపడడం లేదు. అందుకే దుబ్బాకలో జరిగిన నష్టాన్ని గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పూడ్చుకునేందుకు సిద్దమైపోతోంది.
డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు గులాబీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కార్యాచరణ సిద్దం చేశారు. ఎన్నికల బాధ్యతను గతంలో మాదిరిగానే తన కుమారుడు, ఐటీ, పట్టణ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అప్పగించారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, మేయర్ బొంత రామ్మోహన్ డివిజన్ల పర్యటనకు శ్రీకారం చుట్టారు.
2015లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 99 సీట్లు గెలుచుకుని మొదటిసారి జీహెచ్‌ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 150 సీట్లకు గాను 100 సీట్లు గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్యం చేరుకునేందుకు ఆ పార్టీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌ను చుట్టేశారు. కుమారుడుకు ఎన్నికల బాధ్యతను అప్పగించిన కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. తన కుమారుడు సత్తాకు పరీక్ష పెట్టిన కేసీఆర్.. ఆ మేరకు కేటీఆర్ సత్తాను ఇతర రాజకీయ పార్టీలకు చాటి చెప్పారు. పార్టీలో తన తర్వాత వారసుడు కేటీఆర్ అని సంకేతాలు ఇచ్చారు.
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 99 సీట్లు గెలుచుకోగా.. ఎంఐఎం 44 డివిజన్లలో నెగ్గింది. చరిత్రలో తొలిసారి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు డివిజన్లలోనే నెగ్గింది. ఇక బీజేపీతో కలసి పోటీ చేసిన టీడీపీ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుని మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఈ సారి జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటిరిపోరు చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎంఐఎం పార్టీ కూడా టీఆర్‌ఎస్ బాటలోనే నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వేళ పొత్తు అనే మాట వస్తే.. టీఆర్‌ఎస్, ఎంఐఎంల మధ్య స్నేహం కుదిరే అవకాశం ఉంది. గడచిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా.. ఈ సారి ఆ రెండు పార్టీల మధ్య అలాంటి పరిస్థితులు లేవు. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. 2015లో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల వైపు, ఆ రాష్ట్రంలో టీడీపీ గురించి పూర్తిగా వదిలేయాల్సి వచ్చింది. రాజకీయం ఏదైనా అక్కడి నేతల నిర్ణయానికే వదిలేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో ప్రచారం చేసిన నారా లోకేష్ ఈ సారి పార్టీ బాధ్యతను భుజానకెత్తుకోవడం అనుమానంగానే కనిపిస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్వీళ్లూరుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావ మాదిరిగా తయారైంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. మరో వైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలోని నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌లోని నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సాగుతోంది. ప్రస్తుత తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంల మధ్య హోరాహోరి పోరు సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.