iDreamPost
iDreamPost
తెలంగాణాలో టీఆర్‌ఎస్‌కు ఎదురేలేదు. మొన్న దుబ్బాక ఉప ఎన్నిక వరకు రాజకీయవర్గాల్లో విస్తృతంగా నలిగిందీ మాట. అయితే దుబ్బాక ఫలితం చూసాక ఎక్కడో తేడా కొడుతోందే.. అనుకున్నారు. ఇప్పుడు జీహెచ్‌యంసీ ఎన్నికల ఫలితాలతో టీఆర్‌ఎస్‌కు కూడా పోటీ సిద్ధమైందన్న అభిప్రాయానికొచ్చేసారు. మేయర్ పీఠంపై ఎవరైనా కూర్చోనీ.. కానీ నాలుగు సీట్ల నుంచి ఇప్పుడు 48 సీట్లకు బీజేపీ బలం పెరగడం ఖచ్చితంగా టీఆర్‌ఎస్ నాయకులను కలవరపెట్టే విషయమేనంటున్నారు పరిశీలకులు.
ఇకపై ఏకపక్ష నిర్ణయాలు కుదరకపోవచ్చునన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌యంసీ ఎన్నికల్లో గెల్చుకునే ప్రతీ సీటు బీజేపీకి బోనస్ లాంటిదేని చెపాల్పి. అయితే కేంద్ర స్థాయిలో కీలకమైన నాయకులందరినీ తీసుకువస్తేనే ఈ ఫలితాలు వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇలా తాత్కాలికంగా వచ్చే నాయకుల ప్రభావాని కంటే జీహెచ్‌యంసీ ప్రజలు, తద్వారా తెలంగాణా ప్రజలు ప్రత్యామ్నాయాల వైపునుకు మళ్ళుతున్నారన్న సంకేతాలను ఈ ఎన్నికల ద్వారా వెల్లడయ్యాయని స్థిర నిర్ణయాన్ని తెలియజేస్తున్నారు.
తెలంగాణా ఇచ్చిందీ మేమే.. తెచ్చిందీ మేమే అంటూ అప్పుడెప్పుడో అరిగిపోయిన రికార్డరేసుకుంటూ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణా ప్రజలు దాదాపు కోల్డ్ స్టోరేజిలోకి పెట్టిసినట్టే ఉన్నారు. సింగిల్ డిజిట్‌ను దాటి కాంగ్రెస్ తరపున విజయం సాధించిన అభ్యర్ధుల సంఖ్య పెరిగే దాఖలాల్లేకుండా పోయాయి. ఇక టీడీపీ సంగతి సరేసరి. పాపం ఎప్పుడూ హైదరాబాదులోనే ఉంటున్నప్పటికీ ఒక్కసీటు కూడా గెల్చుకోలేకపోయింది. అవకాశం దొరికిన ప్రతిసారీ, ఆ మాటకొస్తే అవకాశం చేసుకుని మరీ హైద్రాబాదును నేనే తయారు చేసా.. అంటూ చెప్పుకునే నారా చంద్రబాబునాయుడిని తెలంగాణా ప్రజలు పూర్తిగానే మర్చిపోయినట్టున్నారు.
ఈ నేపథ్యంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీఆర్‌ఎస్ ప్రభవానికి బీజేపీ రూపంలో అడ్డుకట్ట వేయగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పక తప్పదు. టీఆర్‌ఎస్ వైఫల్యమా? ప్రకృతి విపత్తులా? ప్రత్యర్ధుల చాణక్యమా? అంటే దాదాపుగా ఇవన్నీ కూడా టీఆర్‌ఎస్ వెనకబడడానికి కారణంగా చెప్పుకొస్తున్నారు.
అదే సమయంలో బీజేపీకి మతం, భావోద్వేగాల అజెండాతో ముందుకు వెళ్ళడం కారణంగా ఇంకొన్ని సీట్లు గెలిచే అవకాశాన్ని చేజేతులా పొగొట్టుకుందని బేరీజు వేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణాలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ దారి వెతుక్కుంది. ఇక దాని చూపు చుట్టుపక్కల రాష్ట్రాలపైకి తప్పకుండా వెళుతుందన్నది కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.