తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రకటనతో నిరుద్యోగులకు తీపి కబురు వినిపించిన సర్కారు ఇప్పుడు ఉద్యోగులకు మరో శుభవార్తను వినిపించింది. అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలతో పాటు పదవీ విరమణ వయస్సును పెంచడానికి సిద్ధమైంది సర్కారు. అందుకోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలంలో అపరిష్కృతంగా ఉన్న ఒక్కో సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతోంది. 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన వెంటనే ఉద్యోగుల వయసు పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు హోం గార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశావర్కర్లు, విద్యా వాలెంటీర్లు, పెన్సనర్లు అన్ని వర్గాల వారికీ వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులకు సైతం వేతనాలు పెంచనున్నారు. అన్ని శాఖల్లో కలిపి దాదాపు 9,36,976 మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ వేతనాల పెంపు సహా ఇతర అంశాలపై నివేదిక సమర్పించనుంది.
వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు విషయంలోనూ ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుంది. పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు వంటి పలు అంశాల్లో సమస్యలన్నిటినీ రెండు నెలల్లో పరిష్కరించనుంది ప్రభుత్వం. వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాలను ప్రారంభించనుంది. ఈ అంశాలన్నిటిపై ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లను కమిటీ సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. వేతనాల పెంపు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు నిర్ణయంపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి పదవీ విరమణ వయస్సు పెంచడానికి నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కమిటీ నివేదిక అనంతరం ఎంత వయసు పెంచాలనే విషయంలో ప్రభుత్వం నిర్ణయంతీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ శాఖల్లో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆయా స్థానాల్లో ఖాళీ అయ్యే పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలనుకుంటోంది. వేతనాల పెంపు, పదోన్నతులు, ఉద్యోగాల భర్తీ, పదవీ విరమణ వయసు పెంపుతో పాటు ఉద్యోగులకు అనుకూలమైన సర్వీస్ రూల్స్ ను రూపొందించనుంది ప్రభుత్వం. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీస్ రూల్స్ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కారుణ్య నియామకంలో జాప్యానికి సైతం తెరదించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. వెంటనే కారుణ్య నియామకాలను పూర్తి చేయనుంది. మొత్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల మనసుల్లో కేసీఆర్ చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు.