Idream media
Idream media
దటీజ్ కేసీఆర్ అని మరో మారు నిరూపించుకున్నారు. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో, ఎవరు విజయం సాధిస్తారో, అందుకు ఏం చేయాలో క్షుణ్నంగా పరిశీలించాకే ఆయన నిర్ణయం తీసుకుంటారు. దుబ్బాక ఉప ఎన్నికలో జరిగిన సీన్ .. ఇక్కడ రిపీట్ కాకూడదని ముందు నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చివరి వరకూ అభ్యర్థిని ప్రకటించకుండా రక రకాల ఊహాగానాలను తెరపైకి తెచ్చి విపక్షాలను అయోమయంలో పడేశారు. నామినేషన్ గడువుకు ఒక రోజు ముందు మాత్రమే అధికారికంగా అభ్యర్థిని ప్రకటించినా, అందుబాటులో ఉండాలని అంతకు ముందే నోముల భగత్ కు సీఎం కేసీఆర్ చెప్పారట. ప్రకటించిన నాటికే భగత్ హైదరాబాద్ లోనే ఉన్నారు. నాన్ లోకల్ అని కొందరు, సామాజిక సమీకరణాల పరంగా చూసినా భగత్ కు నాగార్జున సాగర్ సరికాదని ఇంకొందరు రకరకాల వాదనలను వినిపించారు. ఎవరేం చెప్పినా సావధానంగా విన్న కేసీఆర్ చివరలో తన సొంత ఎజెండాను అమలుపరిచారు.
నోముల భగత్ తండ్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత నర్సింహ్మయ్య కు కరుడుగట్టిన కమ్యూనిస్టు యోధుడు. పేదల తరఫున ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. రెండు సార్లు నకిరేకల్ ఎమ్మెల్యేగా సీపీఎం నుంచి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా కూడా గెలుపొందారు. నర్సింహ్మయ్య కు ఎక్కడా చెడ్డ పేరు లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ఆయన తనయుడుకే అవకాశం కల్పించారు. అటు నోములకున్న పేరు, ఇటు ఆయన మృతిపై సానుభూతి కలిసి వస్తాయని నమ్మారు. ఆయన నమ్మకం ఒమ్ము కాలేదు. గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీలో ఉండడంతో ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలతో గట్టి టీమ్ ను ఏర్పాటు చేశారు. ఏదో సాయంత్రం వరకూ ప్రచారం చేసి వచ్చేస్తే సరికాదు.. అక్కడే మకాం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. కేటాయించిన ప్రాంతాల్లో వాళ్లు ఉన్నారా లేదా.., ప్రజలను కలుస్తున్నారా లేదా అని పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
సీఎం కేసీఆర్ వ్యూహాల ముందు, జానారెడ్డి సీనియార్టీ పని చేయలేదు. దీనికి తోడు ఉప ఎన్నికే అయినప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ ఏకంగా రెండు సభల్లో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ లో బీజేపీ పెద్దగా సీన్ లేదని ముందే గుర్తించిన ఆయన కేవలం కాంగ్రెస్ లక్ష్యంగానే విమర్శలు చేశారు. ఆ పార్టీ లోపాలను ఎత్తి చూపారు. బీజేపీ ప్రస్తావన పెద్దగా తేలేదు. జానారెడ్డి ఎంత కష్టపడ్డా, నియోజకవర్గాన్ని ఎన్ని మార్లు చుట్టినా కేసీఆర్ ఛరిష్మా ముందు అవన్నీ పని చేయలేదు. దీంతో కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 70,504 ఓట్లు దక్కాయి. 26 రౌండ్ల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో కేవలం రెండు రౌండ్లలో (10,14) మాత్రమే జానారెడ్డి ఆధిక్యత కనబరిచారు. విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 88,982 ఓట్లు వచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి అనూహ్యంగా వాణీదేవిని నిలబెట్టి గెలిపించుకున్న కేసీఆర్.. నాగార్జున సాగర్ లో భగత్ గెలుపునకు కూడా తనదైన శైలిలో చక్రం తిప్పారనడంలో సందేహం లేదు.