iDreamPost
android-app
ios-app

నిజామాబాద్‌లో పొలిటిక‌ల్ ప్ర‌కంప‌న‌లు

నిజామాబాద్‌లో పొలిటిక‌ల్ ప్ర‌కంప‌న‌లు

నిజామాబాద్‌ జిల్లాలో రాజ‌కీయాలు రంగు మారుతున్నాయి. ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి నేత‌లు జోరుగా జారుకుంటున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని డిచ్‌పల్లి మండలానికి చెందిన అధికార పార్టీ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు వారు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. డిచ్‌పల్లి మాజీ జడ్పీటీసీ దినేష్‌ నేతృత్వంలో శనివారం ఢిల్లీకి వెళ్లిన వారు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇంట్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాజీ జడ్పీటీసీ కులాచారి దినేష్‌ కుమార్‌, నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌ పర్సన్‌ దివ్య, డిచ్‌పల్లి ఎంపీపీ గద్దె శ్రీనివాస్‌ (భూమన్న), వైస్‌ ఎంపీపీ కులాచారి శ్యామ్‌రావు, ఎంపీటీసీ సభ్యులు దండుగుల సాయిలు, బిక్యా నాయక్‌, యెంబడి సంతోష్‌, అప్పాల మంజుల గణేష్‌, కొత్తూరు మానస సాయి, దుంపల సౌమ్య సుధీర్‌, సర్పంచ్‌లు కులాచారి సతీష్‌ కుమార్‌, శివ్వరెడ్డి, పానుగంటి రూప సతీష్‌రెడ్డి, అర్గుల వినోద సదానంద్‌, అనంత సిద్ధిరాములు, మహ్మద్‌ ఖతాజ్‌ యూసుఫ్‌, ప్రమీల గంగారాం, నర్సయ్య, శశాంక్‌ రెడ్డి, కులాచారి లతతో పాటు ఉప సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. బీజేపీ నేతలు మాత్రం వీరితో పాటు మరికొంత మంది పార్టీలో చేరుతారని ప్రకటిస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు సైతం…

బోధన్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఈనెల 7న బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మేడపాటి ప్రకాశ్‌రెడ్డితో పాటు ఇతర నేతలూ చేరనున్నారు. ఆ రోజు బోధన్‌లో జరిగే సమావేశంలో ఎంపీ అర్వింద్‌ నేతృత్వంలో బండి సంజయ్‌ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునే పనిలో బీజేపీ నాయకులు బిజీబిజీగా ఉన్నారు.