iDreamPost
iDreamPost
సక్సెస్ రాజ్యమేలే పరిశ్రమలో కాంబినేషన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అవి హీరో దర్శకుడు నిర్మాత రచయిత ఇలా వీరిలో ఏ ఇద్దరు లేదా ముగ్గురివి కావొచ్చు. సెంటిమెంట్ పరంగానూ విజయాల శాతం పరంగానూ ఇవి నిజమైన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఏళ్ళు కొనసాగిన కొన్ని బంధాలు కేవలం ఒక్క ఫ్లాప్ సినిమాతో విడిపోవచ్చు. అలాంటిదే ఇది కూడా. గత ఇరవై ఏళ్ళలో వచ్చిన బెస్ట్ క్లీన్ ఎంటర్ టైనర్స్ చెప్పమంటే ఖచ్చితంగా నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి, మన్మథుడులకు స్థానం ఉంటుంది.
వీటి దర్శకుడు విజయ్ భాస్కర్ అన్న సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వ ప్రతిభకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ను బలం ఎంత దన్నుగా నిలిచేదో తెలియని విషయం కాదు. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి రేటింగ్స్ దక్కించుకునే ఈ సినిమాలకు ఈ ఇద్దరు కలిసి చేసిన టీమ్ వర్క్ వాటిని ఆయా హీరోల కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిపాయి. కానీ ఒక్క మెగాసినిమాతో ఈ బంధానికి చెక్ పడింది. అదే జై చిరంజీవా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీగా నిర్మించిన ఈ చిత్రం ఆశించిన ఫలితం అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.
అప్పటిదాకా పరాజయమెరుగని విజయ్ భాస్కర్ – త్రివిక్రమ్ కాంబోకు మొదటి షాక్ తగిలింది. అది కూడా గోల్డెన్ ఛాన్స్ లా దొరికిన చిరు సినిమా. దీని కన్నా ముందే త్రివిక్రమ్ దర్శకుడిగా నువ్వే నువ్వే, అతడులతో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ రైటర్ గా జై చిరంజీవ మిస్ ఫైర్ అయ్యింది. మళ్ళీ వీళ్లిద్దరు కలిసి పని చేయనే లేదు. త్రివిక్రమ్ విడిపోయాక విజయ్ భాస్కర్ ప్రేమ కావాలి రూపంలో ఓ యావరేజ్ హిట్ అందుకున్నారు కానీ వెంకటేష్ మసాలా దాకా మిగిలినవన్ని పరాజయం పాలయ్యాయి. అది వచ్చిన 2013 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన సినిమా తీయలేదు కానీ త్రివిక్రమ్ మాత్రం అల వైకుంఠపురములో దాకా ఇంకా అగ్ర దర్శకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. అదే విధి అంటే.