రైల్వే శాఖ ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే తిరగనున్న రైళ్లు
లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా రైళ్ల సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. కాగా ఇలా నడిపే రైళ్లను ప్రత్యేక సర్వీసులుగా పరిగణిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి 15 నగరాలకు రైళ్లను నడపనున్నారు. ఈ నగరాల జాబితాలో సికింద్రాబాద్ కూడా ఉంది.
కాగా రైల్వే శాఖ నిర్ణయించిన రూట్లలో ప్రయాణం చేయాలనుకునే వారు ఈరోజు సాయంత్రం 4గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది. కాగా కేవలం ఆన్లైన్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే స్టేషన్లో టికెట్లు విక్రయించరని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అయితేనే స్టేషన్‌లోకి అనుమతిస్తారు.
కొన్ని నిబంధనలు కూడా రైల్వే శాఖ ప్రజలకు జారీ చేసింది. ప్రయాణికులు గంటముందే స్టేషన్‌కు రావాలి. తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు స్ర్కీనింగ్ నిర్వహిస్తారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోతేనే ప్రయాణానికి అనుమతినిస్తారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ https://www.irctc.co.in/ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఢిల్లీ నుంచి రాకపోకలు సాగే 15 రూట్లు ఇవే
సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై, అహ్మదాబాద్, జమ్మూ తావి.