iDreamPost
iDreamPost
తెలుగు సినిమా పరిశ్రమను రాబోయే 12 రోజులు విపరీతమైన టెన్షన్ కు గురి చేయబోతున్నాయి. షూటింగులు, థియేటర్ల బందు మార్చ్ చివరి దాకా ప్రకటించారు కాబట్టి తర్వాత పరిస్థితి ఏమిటనే అంచనాకు ఎవరూ రాలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. అన్ని ప్రభుత్వాలు కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ లెక్కన ఏప్రిల్ 1నాటికి అంత సద్దుమణగడం అనుమానమే. ఇప్పటికే నాని వి వాయిదా వేశారు. 21 తేది తర్వాత సినిమా హాళ్లు తెర్చుకుంటాయేమోనన్న ఆశతో ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వాయిదా వార్తను ప్రకటించలేదు.
వీటికి ఓవర్సీస్ తో పనిలేదు కాబట్టి తెలుగు రాష్ట్రాలు చాలు. కానీ ఇది జరిగే పనిలా కనిపించడం లేదు. మరోవైపు బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఊహించని ఈ పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెంట్లు, బయట వడ్డీలకు తెచ్చుకున్న పెట్టుబడుల భారం అంతకంతా పెరుగుతూ పోతోంది. గవర్నమెంట్ చెప్పకముందే గోదావరి జిల్లాల్లో థియేటర్లు మూసేశారంటే జనంలో కోవిడ్ మీద ఉన్న భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఏమిటంటే ఏప్రిల్ నుంచి అంత ఈజీగా ఇదంతా సెట్ కాకపోవచ్చు. హాలీవుడ్ ఇప్పటికే ఏకంగా ఆరు వారాల నుంచి పన్నెండు వారాల వాయిదాలు చెప్పేసింది.
ఒకవేళ మన వాళ్ళు ధైర్యం చేసి రిలీజులు చేసుకున్నా ముందసలు జనం బయటికి వస్తేనే కదా. మాల్స్ తెరవమని ఆదేశాలు వస్తే తప్ప అందులో భాగమైన మల్టీ ప్లెక్సులకు మోక్షం రాదు. కేవలం సింగల్ స్క్రీన్లలో సినిమాలు ఆడించుకునేంత సీన్ ఇప్పుడు లేదు గాక లేదు. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే కుదిపేస్తున్న కోవిడ్ 19 తాలూకు సెగలు ఇంకొద్దిరోజులు భరించక తప్పదు. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం తీవ్రతకు అద్దం పడుతోంది. మరి 12 రోజుల సంగతేమో కానీ వచ్చే నెల రెండు లేదా మూడో వారానికి సిచువేషన్ నార్మల్ కాకపోతే ఏం జరుగుతుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అనుభవంతో జుట్టు నెరిసిపోయిన మహా మహా బడా నిర్మాతలు కూడా దీని గురించి ఏమి చెప్పలేకపోతున్నారు. అంతే ఇది ప్రకృతి విసిరిన సవాల్. ఏ హీరో ఎదురుకోలేడు. చూస్తూ ఉండటం తప్ప.