iDreamPost
iDreamPost
సంక్రాంతి పండగ ఏ తేది అనేది పక్కనబెడితే బాక్స్ ఆఫీస్ కు మాత్రం ఐదారు రోజుల ముందే మొదలైపోతుంది. అందుకే రిలీజ్ డేట్లు 9 నుంచే ప్లాన్ చేసుకుంటారు. ప్రతి ఏడాది ఇది సర్వసాధారణంగా జరుగుతున్నదే. కాని ఈ సంవత్సరం జనవరి 10ని మాత్రం ఎవరూ టచ్ చేయలేదు. దానికి కారణం లేకపోలేదు. భయకరమైన నెగటివ్ సెంటిమెంట్ దాని చుట్టూ అల్లుకోవడమే కారణమట. గత ఆరేళ్ళలో ఆ డేట్ కు ఏ సినిమా పెద్ద సక్సెస్ కాకపోవడమే ఉదాహరణగా చెప్పొచ్చు. ఓసారి వాటి మీద లుక్ వేద్దాం.
2014లో మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్ లో 1 నేనొక్కడినే వచ్చింది. ఎంత భారీ హైప్ తో వచ్చిందో అంతకన్నా దారుణమైన టాక్ తో డిజాస్టర్ అయ్యింది. కంటెంట్ మరీ క్లిష్టంగా ఉండటమే దాని పరాజయానికి కారణం. 2015లో పవన్ కళ్యాణ్ వెంకటేష్ కాంబోలో మల్టీ స్టారర్ గా గోపాల గోపాల రిలీజయింది. హిందీ బ్లాక్ బస్టర్ ఓ మై గాడ్ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేదు.2016లో ఆ డేట్ లో అసలే సినిమా రాలేదు. 2017లోనూ ఎవరూ సాహసం చేయలేకపోయారు.
2018లో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ జట్టు కట్టి ఆకాశమే హద్దుగా బిజినెస్ చేసి అజ్ఞాతవాసితో ముందుకు వచ్చారు. అభిమానులు కలలో గుర్తుకువచ్చినా జడుసుకునే స్థాయిలో వారం రోజులకే టపా కట్టేసింది. 2019లో రజినీకాంత్ పేటతో పలకరించాడు. ఇది తమిళ్ లో భీభత్సంగా ఆడినా తెలుగులో మాత్రం సగం ఇన్వెస్ట్ మెంట్ ని కూడా వెనక్కు ఇవ్వలేకపోయింది. ఇక ఏడాది ఈ డేట్ ని ఎవరూ టచ్ చేయలేదు. నిజానికి సరిలేరు, అల వైకుంఠపురములో ఏదో ఒకటి 10కి వస్తుందనే మాట వినిపించింది కానీ ఆయా సినిమాల హీరోలకు దర్శకులకు ఆ తేదీకి సంబంధించిన బ్యాడ్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దాని జోలికి వెళ్లకూడదని అనుకున్నారట. అదండీ జనవరి 10 స్టొరీ.