iDreamPost
android-app
ios-app

ఒకటి తర్వాత మరొకటి.. ఏపీలో ఉత్కంఠ

ఒకటి తర్వాత మరొకటి.. ఏపీలో ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో కీలక ఘట్టానికి మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. నెల రోజులుగా చర్చనీయాంశంగా ఉన్న మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఈ రోజు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఇప్పటికే స్పష్టమైన వ్యూహాంతో సిద్ధంగా ఉంది.

మూడు రాజధానులు, అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకణపై ఈ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగబోతోంది. అంతుకు ముందే ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై తీర్మానం చేయనున్నారు. అనంతరం 10 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా ఖరారు చేయనున్నారు.

అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష టీడీపీ, అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేస్తుండగా, మూడు రాజదానులకు మద్దతుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే అంసెబ్లీలో మూడు రాజధానులపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విధాన పరమైన నిర్ణయం తీసుకోనుంది. మరో వైపు అసెంబ్లీ ముట్టడిస్తామని ప్రతిపక్షం, అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించడంతో అమరావతి ప్రాంతంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు ఏమి జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.