Idream media
Idream media
జార్ఖండ్ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో హోరాహోరి పోరు నడుస్తోంది. 81 స్థానాలు గల జార్ఖండ్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఐడు విడదతల్లో జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ సొంతంగా పోటీ చేయగా, కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దల్ (ఆర్‌జేడీ) కూటమిగా పోటీ చేశాయి. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీలు సొంతంగా పోటీ చేశాయి.
ఉదయం 9:30 గంటల సమయానికి ఫలితాల్లో హోరాహోరి పోరు సాగుతోంది. బీజేపీ 33 సీట్లలో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ కూటమి 38 సీట్లతో దూసుకుపోతున్నాయి. ఇక జార్ఖండ్ వికాస్ మోర్చా నాలుగు సీట్లు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ ఆరు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. స్వతంత్రులు ఒక స్థానంలో ముందజలో ఉన్నారు.
లెక్కింపు ప్రారంభంలో కాంగ్రెస్ కూటమి ముందజలో ఉంది. అయితే రౌండ్ల కొనసాగే కొద్ది ఆధిక్యం మారుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య హోరా హోరి పోరు సాగుతోంది. జార్ఖండ్‌లో మేజిక్ ఫిగర్ 42 సీట్లు. ఈ సంఖ్య వచ్చిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తే ఆధిక్యం దోబూచులాడుతోంది. తుది రౌండ్ ఫలితాల వరకు ఎవరికి ఆధిక్యం వస్తుందన్నది తేలే అవకాశం కనిపించడంలేదు.
గత ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో బీజేపీకి 37, జార్ఖండ్ ముక్తి మోర్చాకు 19, కాంగ్రెస్‌కు 6, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీ 5, జార్ఖండ్ వికాస్ మోర్చా 8 సీట్లలో గెలిచాయి. ఆర్‌జేడీకి గత ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కాగా గత ఎన్నికల ఫలితాల తర్వాత జార్ఖండ్ వికాస్ మోర్చా తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి ఎన్నికల తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో అన్ని జాతీయ చానెళ్ల సర్వేలు కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. మధ్యాహ్నం కల్లా జార్ఖండ్ పీఠంపై ఎవరు కూర్చుంటారన్నది తేలనుంది.