కరోనాని జయించిన ఆ రెండు దేశాలు

ప్రపంచమంతా కరోనా వైరస్ (కోవిడ్‌-19) కోరల్లో విలవిల్లాడుతోంటే ఆ రెండు దేశాలు మాత్రం కరోనాను జయించాయి. ప్రంపంచంలో 215 దేశాల్లో కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే కరోనాను ఆ రెండు దేశాలు తరిమికొట్టాయి. ఆ రెండు దేశాలు ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా నుంచి బయటపడ్డాయి. ఆ రెండు దేశాలు ఏమిటంటే.. వియత్నాం, న్యూజిలాండ్ దేశాలు కరోనా వైరస్ నుంచి బయటపడ్డాయి.

కరోనా పోరులో వియత్నాం విజయం సాధించింది. గత 52 రోజులుగా ఆ దేశంలో ఒక్క కొత్త కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం దేశంలో 22 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ ఏప్రిల్‌ 16 నుండి అంతర్గతంగా కరోనా వ్యాప్తిని దేశం కట్టడి చేసింది. గత 52 రోజుల నుండి కొత్త కేసులేమీ నమోదుకాకుండా జాగ్రత్తలు తీసుకుంది.

ఆ దేశంలో నమోదైన మొత్తం కేసులు కూడా మహమ్మారి ప్రభావం ఎక్కువ ఉన్న దేశాల నుండి వియత్నానికి వచ్చిన వారి నుండే నమోదయ్యాయి. అయితే ఒక్క ప్రాణం పోని దేశాల్లో వియత్నాం కూడా ఒకటిగా నిలిచింది.

ఇక రెండో దేశం న్యూజిలాండ్‌ కోవిడ్‌ను జయించినట్టు ఆ దేశం ప్రకటించింది. కనీసం తాత్కాలికంగానైనా న్యూజిలాండ్‌ కోవిడ్‌ మహమ్మారిని అరికట్టగలగడంతో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

చిట్టచివరి కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తికూడా కోలుకున్నట్టు వైద్య అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ జీరో అయింది. గత పదిహేడు రోజులుగా కోవిడ్‌ పరీక్షలు చేయగా కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఫిబ్రవరి చివరి నుంచి చూస్తే సోమవారం న్యూజిలాండ్‌లో ఒక్క యాక్టివ్‌ కేసుకూడా లేదని ప్రధాని ప్రకటించారు. ‘‘కరోనాను కట్టడిచేశామన్న వార్త వినగానే నేను నా కూతురు నేవ్‌ ఎదుట డాన్స్‌ చేశాను’’ అని ప్రధాని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

‘ప్రస్తుతానికైతే న్యూజిలాండ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలిగింది. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది నిరంతర ప్రక్రియ’ అని మీడియా సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారు.

దేశంలో మళ్ళీ కేసులు బయటపడే అవకాశం కూడా లేకపోలేదనీ, అంత మాత్రాన మనం కరోనా కట్టడిలో విఫలమైనట్టు కాదనీ, అది వైరస్‌ వాస్తవికతగా  అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

సోమవారం అర్థరాత్రి నుంచి దేశంలో కోవిడ్‌ ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రధాని ఆర్డెర్న్‌ ప్రకటించారు. న్యూజిలాండ్‌ భౌగోళిక స్వరూపం రీత్యా ప్రత్యేకంగా ఉండడం వంటి అనేక కారణాల రీత్యా కరోనాని కట్టడిచేయగలిగారని నిపుణులంటున్నారు.  అయితే కరోనా బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా స్వల్పమే. కేవలం 22 మంది మాత్రమే కరోనా వైరస్ వల్ల ఆ దేశంలో మరణించారు. వైరస్‌ని కట్టడిచేసినప్పటికీ  దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది.

Show comments