Idream media
Idream media
తెలుగు సినిమా చరిత్రలో చిత్తూరు నాగయ్య ఒక మహోన్నత వ్యక్తి, దయగల మనిషి. అమాయకుడు, నమ్మి మోసపోయిన వాడు. చివరి రోజుల్లో కష్టాలు పడ్డాడని, అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేవని చెబుతారు. నిజమే. అందరూ వచ్చి పార్థివదేహాన్ని సందర్శించి వెళ్లారు. MGR అలా వెళ్లలేదు. కష్టసుఖాలు తెలిసిన మనిషి. అందుకే ప్రజానాయకుడు. మహనీయుడు నాగయ్య అంత్యక్రియలకి డబ్బులు లేవని గ్రహించి తానే ఖర్చు పెట్టి అంత్యక్రియలు జరిగేలా చూశాడు.
ఈ విషయాన్ని చాలా మంది సినిమా వాళ్లు ఉదహరిస్తారు. నాగయ్యని చూసి డబ్బు విషయంలో ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకున్నామని చాలా మంది అన్నారు. నిజమే అది నేర్చుకోవాల్సిన విషయమే. నాగయ్య మరణం నుంచి నేర్చుకున్న వాళ్లు ఎందరో! జీవితం నుంచి నేర్చుకున్న వాళ్లెందరు?
నాగయ్య జీవితం అద్భుతం. ఒక యోగిలా, మహర్షిలా జీవించాడు. అందుకే ఆ కళ్లలో అంత దయ! అది నటన కాదు, హృదయం. గర్భవతిగా అడవిలో ఒంటరై పోయిన దిక్కులేని సీతమ్మని ఆదరించిన వాల్మీకి మహర్షి అచ్చం నాగయ్యలాగే ఉంటాడేమో! లవకుశ చూడండి ఆ తేజస్సు అర్థమవుతుంది.
మనుషుల కష్టాలకే కాదు , జంతువుల కష్టాలను చూసి కూడా చలించిపోయే హృదయం. ఒకసారి నాగయ్య స్వయంగా డ్రైవ్ చేస్తుంటే మైలాపురంలో కారు కింద పడి కుక్క చచ్చిపోయింది. దుక్కంతో ఆయన కుక్కకి గౌరవంగా అంత్యక్రియలు జరిపించాడు. అంతేకాదు కర్మకాండ చేసి ఆ ఏరియాలో వున్న కుక్కలన్నింటికి విందు భోజనం పెట్టాడు.
Also Read: మరిచిపోలేని నటి జయంతి
మన సినిమా వాళ్లు వేదిక మీద మాట్లాడ్తారు కానీ, చాలా మంది నిర్మాతలు ఆఖరి నెల జీతాలు ఎగ్గొడతారు. అంటే ఆగస్టు 20వ తేదీ షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొడితే, ఆగస్టు నెల జీతాలు పోయినట్టే. పోస్టు ప్రొడక్షన్‌లో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి జీతాలు ఎగ్గొట్టిన వాళ్లు ఎందరో!
ఒకసారి జైహింద్ సత్యం (ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్, హేమమాలిని, రేఖ దగ్గర నుంచి గొప్ప హీరోయిన్లంతా ఈయన తీసిన ఫొటోలనే తొలి సినిమా అవకాశం కోసం ఇచ్చారు) నాగయ్య దగ్గరికి జాబ్ కోసం వెళ్లారు. జీతం ఎంత కావాలని అడిగారు. 20 రూపాయలని సత్యం చెప్పాడు. మద్రాస్ మహానగరంలో 20తో ఎలా బతుకుతావ్ నాయనా, 40 తీసుకో అన్నాడు. నాగయ్య గొప్పతనం గురించి రాసిన వ్యాసంలో సత్యమే స్వయంగా చెప్పాడు.
ప్రపంచంలోని గొప్ప దర్శకుల్లో కేవీరెడ్డి ఒకడు. భక్తపోతన తీస్తున్నప్పుడు నాగయ్యకి క్రాప్ తీయించి మేకప్ వేశారు. పోతనగా ఉన్న నాగయ్యని చూసి కేవీరెడ్డి చాలా సేపు మాట రాకుండా ఉండిపోయాడట. ఆ వర్చస్సును చూసి పోతనే ఈయన్ని ఆవహించాడా? లేదా గత జన్మలో ఈయనే పోతన అనుకున్నాడట! నాగయ్యని ప్రేమగా బావా అని పిలిచే లింగమూర్తి చెప్పిన విషయం ఇది.
ఒక్క అడుగు ఫిల్మ్ కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడని కేవీ రెడ్డి యోగివేమన ఆఖరి సమాధి సీన్‌లో నాగయ్యని చూస్తూ కట్ చెప్పడం మరిచిపోయాడు
Also Read: సార్పట్ట ఒక అద్భుతం!
భక్తపోతనలో తాను పస్తులుండి, ఇంటికొచ్చిన అతిథికి ప్రేమగా అన్నం పెట్టే సీన్‌లో నాగయ్య కళ్లలోని దయ, తడి గమనించండి. ఆయన అలాగే జీవించారు. ఆయన ఆఫీస్‌లో నిత్యాన్నదానం. ఆకలితో వచ్చిన వాళ్లకి ఆకు వేయడమే తప్ప ఎవరని అడగరు.ఆ ఆఫీస్‌లో ఒక మూల ట్రంకు పెట్టెతో జీవించిన వాళ్లెందరో! పద్మనాభం ,పేకేటి శివరాం అలాగే జీవించారు. నాగయ్య ఎంత భోళా మనిషంటే , ఔట్‌డోర్ షూటింగ్ చూడ్డానికి వచ్చిన వాళ్లకి కూడా భోజనం పెట్టేంచేవారు. మరీ అంత కాకపోయినా ఫర్వాలేదు, షూటింగ్‌లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులకి ఒకట్రెండు కూరలు, మజ్జిగ నీళ్లు కాకుండా మంచి భోజనం పెట్టడం మనవాళ్లు నేర్చుకుంటే చాలు. హీరోల మీద ఎంతైనా ఖర్చు పెట్టేవాళ్లు, ఆఫీసుల్లో భోజనాల దగ్గర మిగల్చాలని చూస్తారు.
కోడంబాకంలో ఇప్పుడు సెంటు స్థలం కొనలేం. అక్కడ 52 ఎకరాల తోట నాగయ్య సొంతం. స్టూడియో కడదామని నమ్మించి ఒక జమీందారు చేసిన మోసానికి అమ్ముకున్నారు. ఆస్తి వదులుకుంటున్నప్పుడు ప్రాప్తం అన్నాడు తప్ప , మోసం అనలేదు. ఏనుగెక్కి ఊరేగిన వాడు, మైసూరు మహారాజుతో బంగారు కాసుల సన్మానం పొందిన వాడు, ఎంఎస్ సుబ్బులక్ష్మికి సంగీత మెలకువలు నేర్పించిన వాడు, ఎందరికో విద్యాదానం చేసిన వాడు, వాణిమహల్ కట్టించిన వాడు. చివరి రోజుల్లో 500కి వేషం వేశాడు., ఆస్పత్రిలో చేరి కూడా తన వల్ల నిర్మాత నష్టపోకూడదని , సహాయకుడితో వచ్చి తన పాత్రని ముగించిన వాడు.
దేశం కోసం జైలుకు వెళ్లిన వాడు, రమణ మహర్షి ఆశ్రమంలో రెండేళ్లు జీవించిన వాడు. విలేకరిగా వచ్చి కొద్ది మొత్తంలో కూడా ప్రతి నెలా కాంగ్రెస్‌కి విరాళం ఇచ్చిన మనిషి. నాగయ్య గురించి ఎంతైనా చెప్పొచ్చు.
ఎవరినీ లెక్క చేయని భానుమతి ఆయన్ని చూస్తే నాన్న గారు అని లేచి నిలబడేది. బాగా బిజీగా వున్న రోజుల్లో కూడా NTR, ANR, శివాజీ, రేలంగి కాల్‌షీట్స్ ఇచ్చి ఉచితంగా రామదాసులో నటించారు.
చివరిలో కష్టాలు పడినా , జీవితమంతా నలుగురి మంచి కోసం జీవించాడు. ఈ జనరేషన్‌లో సోనూసూద్ అలాంటివాడు. ఒకవేళ సోనూసూద్‌కి ఆర్థిక కష్టాలు వస్తే మనం అనే మొదటి మాట “తనకు మాలిన ధర్మం”. అసలు ధర్మం బతికి ఉన్నదే నాగయ్య, సోనూసూద్ లాంటి వాళ్ల వల్లే. డబ్బే వెలుగు అనుకుని జీవించే వాళ్లకి ఏం చెబుతాం? ప్రకృతి మనకి పగలు సూర్యున్ని, రాత్రి చంద్రున్ని ఇచ్చింది. కానీ మనం అంధకారాన్నే ఎక్కువ ఇష్టపడతాం. కళ్లున్న గుడ్డివాళ్లం!
Also Read: అసురన్‌ని “నారప్ప” అందుకున్నాడా?