అసుర‌న్‌ని "నార‌ప్ప‌" అందుకున్నాడా?

By G.R Maharshi Jul. 20, 2021, 06:03 pm IST
అసుర‌న్‌ని "నార‌ప్ప‌" అందుకున్నాడా?

అసుర‌న్ , నార‌ప్ప‌గా తెలుగులో వ‌స్తాడ‌ని తెలిసిన‌పుడు చాలా అనుమానాలు. ధ‌నుష్‌లా వెంక‌టేష్ చేయ‌గ‌లుగుతాడా? వెట్రిమార‌న్ లెవెల్‌లో శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్ వుంటుందా? మ‌న తెలుగులో అన్ని భూస్వామ్య భావ‌జాల‌పు క‌థ‌లే త‌ప్ప ద‌ళిత నేప‌థ్యం వున్న క‌థ‌లు త‌క్కువ‌. వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోని ప్రేక్ష‌కులు ఆ ర‌కంగా చూస్తారా? వీట‌న్నిటికి స‌మాధానం నార‌ప్ప చెప్పేశాడు.

వెంక‌టేష్‌లో విల‌క్ష‌ణ న‌టుడున్నాడు. కానీ ఆయ‌నే రిస్క్ తీసుకోకుండా కెరీర్‌లో ఎక్కువ భాగం రొటీన్ సినిమాలు చేసేశాడు. దృశ్యం, గురు, గోపాలాగోపాలా ఇలా గ‌ట్టిగా ప‌ది వెరైటీ సినిమాల పేర్లు కూడా చెప్ప‌లేం. విచిత్రం ఏమంటే అవ‌న్నీ రీమేక్‌లే. ఇంకో చోట హిట్ అయ్యాయి కానీ, అవే క‌థ‌లు మ‌న తెలుగు డైరెక్ట‌ర్లు ఎవ‌రైనా చెబితే చేసేవాడు కాదేమో!

అయితే వెంక‌టేష్ స్పెషాలిటీ ఏమంటే ఒక‌సారి దిగితే రీమేక్‌ని మ‌రిపిస్తాడు. దృశ్యంలో మ‌న‌కు ఒక తండ్రిగా వెంక‌టేష్ క‌నిపిస్తాడు. మళ‌యాళ సినిమా చూసినా కూడా మోహన్ లాల్ గుర్తుకురాడు. నార‌ప్ప కూడా అంతే. అసుర‌న్ చూసినా కూడా మ‌న‌కు ధ‌నుష్‌ని మ‌రిపిస్తాడు. ఆ పాత్ర కోసం వెంక‌టేష్ ప‌డిన త‌ప‌న‌, శ్ర‌మ అంతా బాడీ లాంగ్వేజ్‌లో క‌నిపిస్తుంది. ఒక ద‌ళిత రైతు, తండ్రిని మాత్ర‌మే చూస్తాం. ఒక ర‌కంగా వెంక‌టేష్ విశ్వ‌రూపం ఈ సినిమా.

శ్రీ‌కాంత్ అడ్డాల బేసిక్‌గా ఫ్యామిలీ మ్యాన్‌. హింస న‌చ్చ‌దు. సీత‌మ్మ వాకిట్లో ఇద్ద‌రు పెద్ద హీరోలున్నా ఫైట్స్ జోలికి పోలేదు. బ్ర‌హ్మోత్స‌వం ఆడ‌లేదు కానీ, చెప్పిన పాయింట్ చాలా బావుంటుంది. ఎలెక్స్‌హెలీ "రూట్స్" త‌ర‌హా పాయింట్ తీసుకుని త‌డ‌బ‌డ్డాడు. మ‌రి అత‌నికి ద‌ళిత రైతు, భూమి కోసం జ‌రిగే పోరాటం అర్థ‌మ‌వుతాయా? అంటే అర్థం చేసుకున్నాడు. అసుర‌న్‌కి ఇది జిరాక్స్ కాపీ కాదు. ఒక గొప్ప పెయింటింగ్‌ని చూసి అలాగే గీసే ప్ర‌య‌త్నం. జిరాక్స్‌కి మిష‌న్ చాలు. కానీ పెయింటింగ్ రీప్రొడ్యూస్ చేయాలంటే మ‌న‌సుండాలి, క‌ళ తెలియాలి. అసుర‌న్‌లో వున్న ఆత్మ‌ని శ్రీ‌కాంత్ ప‌ట్టుకున్నాడు. అదే ఆయ‌న స‌క్సెస్‌.

భూమి కోసం పేద‌లు, ద‌ళితులు చేసే పోరాటంపైన మ‌న‌కి సినిమాలు త‌క్కువే. గ‌తంలో మాదాల‌, నారాయ‌ణ‌మూర్తి ప్ర‌య‌త్నించినా అవి నినాదాల హోరు, జోరులో ఇరుక్కుపోయాయి. ఈ మ‌ధ్య క‌రుణ‌కుమార్ తీసిన ప‌లాస‌లో కూడా హింస వున్నా సెన్సిటివ్‌నెస్ వుంది. బ్యాడ్‌ల‌క్ కొద్దీ ఆ సినిమా క‌రోనాలో చిక్కుకుని OTTలో బ‌య‌ట‌ప‌డింది.

ఇందిరాగాంధీ టైం నుంచి ద‌ళితుల‌కి భూమిని ఇస్తూనే వున్నారు. అదంతా ఏమైంది? పెద్ద‌వాళ్లు క‌లిపేసుకున్నారు. వైసివిరెడ్డి మావూరి మాదిగోడు అనే క‌థ రాసారు. దాంట్లో ఒక ద‌ళిత ముస‌లాయ‌న ఏమంటాడంటే భూమి కోసం తిరుగుతున్నారు కానీ, ఒక‌వేళ భూమి వ‌చ్చినా ఈ రైతులు మ‌న‌ల్ని దున్న‌నిస్తారా? ప‌ంట పండించ‌నిస్తారా? అని అడుగుతాడు. కాగితాల్లో భూమిపై హ‌క్కులుంటాయి కానీ, అందులో ఒక్క గింజ కూడా ద‌ళితుల‌కి రాదు. వినోభాభావే భూదాన ఉద్య‌మం చేశాడు. ఆయ‌న ముందు దానం చేసి, వెళ్ల‌గానే లాక్కున్నారు.

నార‌ప్ప క‌థ అనంత‌పురం జిల్లాలో జ‌రుగుతుంది. NTR ముఖ్య‌మంత్రిగా వున్న‌ప్పుడు తెలుగు మాగాణి స‌మారాధ‌న అని ఒక స‌భ పెట్టి ఉర‌వ‌కొండ స‌మీపంలోని కౌకుంట్ల‌లో రైతుల‌కి, బీసీల‌కి ప‌ట్టాలు ఇచ్చాడు. అది ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప‌య్యావుల కేశవ్‌ వూరు. అపుడు పంచిన భూములు ఎంత మంది పేద‌లు అనుభ‌విస్తున్నారో లెక్క‌లు తీస్తే తెలుస్తుంది. 1980 కాదు, ఇప్ప‌టికీ గ్రామాల్లో ద‌ళితులు, బ‌ల‌హీనుల భూమిని లాక్కుంటూనే ఉన్నారు. పోలీసుల‌, రెవెన్యూ వాళ్లు స‌హ‌క‌రిస్తూనే వున్నారు. కోర్టుల్లో న్యాయానికి డ‌బ్బు ఖ‌ర్చు పెట్టుకోలేని వాళ్లు ఒత్తిడికి లొంగి సినిమాలోని నార‌ప్ప‌లా భూమిని వ‌దిలేసుకుంటారు. వెంక‌టేష్ హీరో కాబ‌ట్టి ఫైటింగ్ చేస్తాడు. జీవితంలో ఫైట్ చేయ‌డం క‌ష్టం. అయినా ఏదో రూపంలో పోరాటం వుండే వుంటుంది.

గ‌తంలో ఉర‌వ‌కొండ‌, పెనుకొండ ప్రాంతాల్లో న‌క్స‌ల్ ఉద్య‌మం రావ‌డానికి ఈ భూస‌మ‌స్యే కార‌ణం. రాయ‌ల‌సీమ‌లో ఈ భూస‌మ‌స్య‌కి ఇంకో కోణం కూడా వుంది. ద‌ళితులు, బీసీలు త‌మ‌కున్న కాసింత భూమి కాపాడుకోడానికి ఎవ‌రో ఒక‌రు ఫ్యాక్ష‌నిస్ట్ నీడ‌న చేరి, అత‌ని వెనుక క‌త్తులు, బాంబులు మోసి ప్రాణాలు కోల్పోయిన వాళ్లున్నారు. ఆఖ‌రి సీన్‌లో నార‌ప్ప చెప్పిన‌ట్టు భూమిని లాక్కుంటారు, డ‌బ్బుని లాక్కుంటారు, చ‌దువుని లాక్కోలేరు. ఈ 40 ఏళ్ల‌లో వ‌చ్చిన మార్పు అదే.

సినిమాలో ప్రియ‌మ‌ణి చాలా గొప్ప‌గా న‌టించింది. ఆమెతో ఇన్నాళ్లు నానా చెత్త వేషాలు వేయించిన డైరెక్ట‌ర్లు ఆమెకి క్ష‌మాప‌ణ చెప్పుకోవాలి. ప్రియ‌మ‌ణికి బ‌దులు స్క్రీన్‌పైన సుంద‌ర‌మ్మ క‌నిపించిందంటే అది ఆమె టాలెంట్‌.

థియేట‌ర్‌లో వ‌స్తే రెస్పాన్స్ ఎలా వుండేదో తెలియ‌దు కానీ, OTTలో అద్భుతంగా వుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. అనంత‌పురం, చిత్తూరు, అక్క‌డ‌క్క‌డ నెల్లూరు ర‌క‌ర‌కాల యాస‌లు వినిపిస్తాయి. ఒక ప్రాంత‌పు యాస మీద ప‌ట్టు సాధించ‌డం అంత సుల‌భం కాదు. అయినా పాస్ మార్క్‌లు సాధించారు.

ఆర్ట్ డైరెక్ట‌ర్ చాలా జాగ్ర‌త్త‌గానే వున్నాడు. కానీ ఆయ‌న‌కి కూడా తెలీకుండా త‌ప్పులు దొర్లిపోతాయి. Timeని చూపించ‌డం క‌ష్టం. వెంక‌టేష్ ప్లాష్‌బ్యాక్‌లో ఆప్కో సొసైటీ అని వాల్ రైటింగ్ వుంటుంది. అప్ప‌టికి ఆప్కో పుట్ట‌లేదు. 1976లో దాన్ని స్థాపించారు. వెంక‌టేష్ కోర్టుకి వ‌చ్చిన‌పుడు అనంత‌పురంలోని థియేట‌ర్ పోస్ట‌ర్లు క‌నిపిస్తాయి. వాటిలో నీలిమ థియేట‌ర్ కూడా వుంటుంది. ఈ క‌థ జ‌రిగేనాటికి నీలిమ లేదు. అప్పుడు అది రామ‌చంద్రా టాకీస్‌. కాల‌క్ర‌మంలో పేరు మార్చుకుంది.

మ‌న‌కి చుండూరు, కారంచేడు హ‌త్యాకాండ చ‌రిత్ర వుంది. అదంతా గ‌తం అని అనుకుంటారు. కానీ బ‌ల‌హీనుల‌పైన ఉక్కుపాదం ఏమీ మార‌లేదు. లోహం స్వ‌భావం మారిందేమో కానీ పాదం అలాగే వుంది.

Also Read: నారప్ప రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp