వీడియో: రైలులో దొంగతనానికి వెళ్లి.. ప్రాణాల మీదకు ..

చాలా మంది రైలు ప్రయాణాలను ఆస్వాదిస్తుంటారు. రిజర్వేషన్ అయితే ఇక హ్యాపీ జర్నీరే. అదే జనరల్ బోగీల్లో అయితే సీటు ముఖ్యంగా విండో సీటు కోసం పోటీ పడుతుంటారు. ఇక అక్కడ సీటు దొరికితే.. వాళ్లంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు. అలాగే డోరు దగ్గర నిలబడే వాళ్లకు చిక్కులు తప్పవు. ఏదీ ఏమైనప్పటికీ.. కొన్ని సార్లు రైలు ప్రయాణాలు తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను చవిచూస్తుంటాం. ముఖ్యంగా రైలు ప్రయాణం అనగానే గుర్తుకు వచ్చేది దొంగలున్నారు జాగ్రత్త అనే అనౌన్స్‌మెంట్. అయితే కేవలం జేబు దొంగల వల్లే నష్టం అనుకుంటే పొరపాటు.. రైలు స్టేషన్ లో  ట్రైన్ ఆగడం ఆలస్యం కిటీకీ దగ్గరో లేదా, డోరు వద్ద ఉన్న వ్యక్తుల మెడల్లో ఉన్న నగలు, చేతికి ఉంగరం, గడియారం, సెల్ ఫోన్ వంటివి దోచేస్తున్నారు దొంగలు. రైలు కదిలే సమయం తెలుసుకుని, ఆ సమయంలో చటుకున్న ప్రయాణీకుల చేతిలో ఉన్న ఫోన్లను లాక్కుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటున్నారు ప్రయాణీకులు.

ఇలానే ఓ దొంగ దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే..? బీహార్‌లో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువన్న సంగతి విదితమే. రోడ్డు, రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తున్న వ్యక్తులే కాకుండా రైళ్లల్లో వెళ్లిన వ్యక్తులను లూఠీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో దొంగలు మరింత తెలివి మీరిపోయారు. ఆగిన రైలు కిటికీలు లేదా తలుపుల వద్ద ఉన్న ప్రయాణీకుల జేబులకు కన్నం వేయడం,  లేదంటే.. వారి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ లేదా ఇతర వస్తువులు లాక్కొని, వారి కళ్ల ముందు నుండి పరార్ అవుతున్నారు. దీంతో వీళ్లు రైళ్లలో నుండి దిగలేని పరిస్థితి. తాజాగా బీహార్-బెసుగాయ్ ప్రాంతంలో ఆగి ఉన్న రైలులో చోరీకీ పాల్పడ్డాడు దొంగ. సెల్ ఫోన్ దొంగిలిద్దామనుకునే సరికి ఓ ప్రయాణీకుడు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అంతలో రైలు కదలడంతో.. ఆ దొంగ వెంటనే కిటికీ ఊసలు పట్టుకుని వేలాడాడు. ఈ క్రమంలో అతడు కింద పడిపోకుండా కాలిని గట్టిగా పట్టుకున్నారు ప్రయాణీకులు. చివరకు రైలు మరో స్టేషన్ లో ఆగగానే.. అతడ్ని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Show comments