iDreamPost
iDreamPost
ఏదైనా బాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను రీమేక్ చేసేటప్పుడు అది ఎంత విజయం సాధించిందనే దానికన్నా అందులో ఎవరు నటించారు వాళ్ళ ఇమేజ్ ఎలా ఉపయోగపడిందన్నది చెక్ చేసుకోవడం చాలా కీలకం. ఈ కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం మరోలా ఉంది. దానికో ఉదాహరణ చూద్దాం. 2008లో నీరజ్ పాండే దర్శకత్వంలో వచ్చిన హిందీ మూవీ ఏ వెడ్ నెస్ డే విమర్శకులను మెప్పించడమే కాదు వసూళ్ల పరంగానూ గొప్ప విజయం అందుకుంది. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటులు అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ చిత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప క్లాసిక్ గా నిలిచిపోయింది.
Also Read: చిన్న పాపతో మణిరత్నం సాహసం – Nostalgia
ఓ మాములు మధ్యతరగతి వ్యక్తి మొత్తం పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని ఫోన్ కాల్స్ ద్వారా గడగడలాడిస్తాడు. నగరంలో బాంబులను పెట్టి అన్నీ పేల్చేస్తానని బెదిరిస్తాడు. దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని కంకణం కట్టుకుంటాడు. కానీ అది క్లైమాక్స్ వరకు సాధ్యపడదు. ఇదంతా అతను ఎందుకు చేశాడంటే చెరలో ఉన్న ఉగ్రవాదులను బయటికి తీసుకొచ్చి మట్టుబెట్టేందుకని తెలుసుకుని మీడియా పబ్లిక్ షాక్ అవుతారు. దానికి కారణం ఏంటి, ఇదంతా ఎలా జరిగిందనేది చూపు పక్కకు తిప్పుకోనివ్వని స్క్రీన్ ప్లేతో తెరమీద చూసినవాళ్లకే ఆ థ్రిల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
దీన్ని తెలుగులో తనతో పాటు వెంకటేష్ కాంబినేషన్ లో చక్రి తోలేటి(సాగర సంగమంలో ఫోటోలు తీసే పిల్లాడు) దర్శకత్వంలో స్వీయ నిర్మాణం చేశారు కమల్ హాసన్. నసీరుద్దీన్ షా పాత్ర ఈయనే చేసి అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ వెంకీకి ఇచ్చారు. తమిళంలో వెంకటేష్ బదులు మోహన్ లాల్ ఉంటారు. ఒరిజినల్ వెర్షన్ కి భిన్నంగా ఇక్కడ అందరూ స్టార్ హీరోలే చేయడంతో ఈనాడు (2009) టైటిల్ తో రూపొందిన ఈ రీమేక్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా కమల్ వెంకీ ఎక్కడికీ వెళ్లకుండా ఎవరికి వారు విడివిడిగా ఒకే చోట ఉండటం అనే థీమ్ ఇక్కడి మాస్ కు కనెక్ట్ కాలేకపోయింది. ఏ వెడ్ నెస్ డే లో రెండు వృద్ధ పాత్రలను ఇక్కడి వెర్షన్ లో మార్చేయడం కూడా ఒకరకంగా మైనస్ అయ్యింది. కాకపోతే నిజాయితీగా తీసిన రీమేక్ అనే సంతృప్తి మిగిలింది అంతే
Also Read: స్నేహంలోని అందమైన కోణం – Nostalgia