iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగబద్ధమే

నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగబద్ధమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాజ్యాంగబద్ధంగానే తొలగించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను తొలగించే అధికారం గవర్నర్కు ఉందని పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారని పేర్కొంది. నిమ్మగడ్డ తొలగింపుకు సంబంధించిన పూర్వాపరాల తో కూడిన అఫిడవిట్ను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు ముందుంచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తనను తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇతరులు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్ల ను విచారించిన ధర్మాసనం పూర్వాపరాల తో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20వ తేదీన హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ అంశంపై కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని తెలిపింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు, ఇతర రాష్ట్రాలకు ఎలాంటి పోలిక లేదని తెలిపింది. ఎన్నికలు వాయిదా పడినా కూడా కోడ్ అమలులో ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత నిమ్మగడ్డ వ్యవహరించిన తీరును హైకోర్టుకు వివరిస్తూ అతని పిటిషన్ ను కొట్టేయాలని కోరింది.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ ను కారణంగా చూపి గత నెల 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు ఆశ్చర్యపోయాయి. రమేష్ కుమార్ వ్యవహరించిన తీరును సీఎం జగన్ తూర్పారబట్టారు.

నామినేషన్లు జరిగిన తీరును, ఏకగ్రీవాలను తప్పు పట్టే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో ఓ లేఖ విడుదలైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ లేఖను కేంద్రానికి రాసినట్లుగా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ లేఖ తాను రాసిందో కాదో అని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్నమొన్నటి వరకు చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజును నియమించింది. ఐదేళ్ల పదవీకాలాన్ని మూడేళ్ల కు తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవినుంచి దిగిపోవాలని వచ్చింది. తన తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20న జరిగే విచారణ లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి.