ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదంట….

  • Published - 04:39 AM, Wed - 24 June 20
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడే కాదంట….

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుపై రెవెన్యూ శాఖ కసరత్తు చేసింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఓ జిల్లాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో 25 జిల్లాలకు పైగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించగా ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కాగా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 25 జిల్లాల ప్రస్తావన తీసుకురావడంతో తిరిగి చర్చ మొదలయింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినా కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో ఆచరణ సాధ్యం కాదని అధికారులతో పాటు నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికి కారణం జనాభా లెక్కలు పూర్తయ్యేవరకు భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఫ్రీజ్‌ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లో ఉండటమే..

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలంటే గ్రామం, మండలం, డివిజన్ల పునర్వ్యవస్ధీకరణ జరగాలి. ఆ తర్వాతే జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. కానీ జనాభా లెక్కలు అంశం తెరపైకి రావడంతో రాష్ట్రంలో భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భౌగోళిక సరిహద్దులు మార్చకుండా రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఫ్రీజ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో జనాభా గణన ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు..దాంతో పాటు అమల్లో ఉన్న ఫ్రీజ్ ఉత్తర్వులు వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఫ్రీజ్ ఉత్తర్వులు జనాభా గణన పూర్తయిన తర్వాత మాత్రమే ఉపసంహరించుకునే వీలుంది. అప్పటివరకూ కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు..

Show comments