జగన్‌ కోరుకుంటున్న జవాబుదారీతనం

ఏ రంగం, ఏ విభాగంలోనైనా జవాబుదారీతనం ముఖ్యం. కానీ మన రాజకీయ, అధికార వ్యవస్థలో అదే లోపించింది. ఒక పని కోసం అధికారుల దగ్గరికి వెళ్తే అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.. ఎప్పుడు పూర్తి చేస్తారో ఏ అధికారీ చెప్పరు. తిరిగి తిరిగి మనమే అలసిపోవాల్సిందే. కాలక్రమంలో జవాబుదారీతనం అనే మాటే తన మనుగడను కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితి నుంచి సమూల మార్పులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యోచిస్తున్నారు. ప్రతి విషయంలోనూ అకౌంటబులిటీని తేవాలని అధికారులకు మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో ప్రతి సమీక్ష సమావేశంలోనూ ఈ అంశంపై తగు సూచనలు చేస్తున్నారు. జగన్‌ కోరుకుంటున్నట్లుగా జవాబుదారీతనాన్ని పూర్తిస్థాయిలో అధికారులు అలవరుచుకుంటే ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసినట్లే.

ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాలూ జరుగుతున్నాయి. అలాగే ఇసుక డోర్‌ డెలివరీ కూడా కొనసాగుతోంది. అయితే ఇలాంటి కార్యక్రమాలల్లో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సీఎం జగన్‌ కోరుకుంటున్నారు. స్పందన, సచివాలయాల్లో వచ్చే ఫిర్యాదులు లేదా సమస్యలపై కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులు అనుక్షణం పర్యవేక్షించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇచ్చిన వినతిని ఎన్నిరోజుల్లో పరిష్కరించేది తేదీతో సహా రశీదును ఇవ్వాలి. అలాగే సమస్య పరిష్కరించిన తర్వాత.. ఎవరైతే వినతి ఇచ్చారో వారి నుంచి అక్‌నాలెడ్జ్‌మెంట్‌ కాపీ తీసుకోవాలని గట్టి ఆదేశాలు ఇస్తున్నారు. నకిలీ మద్యం, శాంతి భద్రతలపై వచ్చే ఫిర్యాదులను స్థానిక పోలీసు అధికారులతో పాటు, జిల్లా ఎస్పీ, డీజీపికి కూడా పంపించాలని సీఎం జగన్‌ సూచిస్తున్నారు. వారు వేరే పనిలో ఉంటే మరోసారి అలర్ట్స్‌ కూడా పంపించాలని ఆదేశాలు ఇస్తున్నారు. తద్వారా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉంటూ కింది స్థాయి అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుందనేది జగన్‌ భావన.

సాధారణంగా రాజకీయ నాయకులు తమ పరిపాలనలో వస్తున్న సమస్యలను, ప్రజల ఫిర్యాదులను చెప్పుకోవడానికి ఇష్టపడరు. దీనికి పూర్తి విరుద్ధంగా ఆయా జిల్లాల్లో ఏ అంశంపైనైతే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో గుర్తించి ఎలాంటి బేషజాలకు పోకుండా సీఎం జగన్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. పరిష్కారాలు సూచిస్తున్నారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలకు ఆదేశాలిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ జవాబుదారీతనానికి సీఎం జగన్‌ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇదే పరిస్థితి ఐదేళ్లూ కొనసాగితే రాష్ట్రంలో ఒక నూతన శకం ప్రారంభమైనట్లే.

Show comments