iDreamPost
android-app
ios-app

థియేటర్లు అందుకే భయపడుతున్నాయి

  • Published May 19, 2020 | 5:01 AM Updated Updated May 19, 2020 | 5:01 AM
థియేటర్లు అందుకే భయపడుతున్నాయి

సినిమా హాళ్లు తెరుచుకోవడం గురించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ప్రస్తుతానికి లాక్ డౌన్ లో వీటికి అనుమతించే ప్రసక్తే లేదని మాత్రం తేల్చి చెబుతున్నారు. పరిశ్రమ వర్గాలు ఆగస్ట్ లేదా దసరా పండగ దాకా పరిస్థితి సాధారణం కావడం కష్టమని అంచనా వేస్తున్నాయి. ఒకవేళ థియేటర్లు తెరిచినా సవాలక్ష నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. సీట్ల మధ్య గ్యాప్, ప్రతి షోకు మధ్య ముప్పావుగంట బ్రేక్, రోజు మూడు ఆటలే ప్రదర్శించడం, శానిటైజేషన్ ఏర్పాట్లు ఇవన్నీ అందులో కొన్ని మాత్రమే.

ఇవన్నీ అదనపు భారం కలిగించేవే. పోనీ టికెట్ రేట్లు పెంచుకుని అమ్ముదామా అంటే ప్రేక్షకులు మొత్తానికే దూరమయ్యే ప్రమాదం ఉంది. అసలే ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కు రెడీగా లేదు, వి, రెడ్, క్రాక్, ఉప్పెన, అరణ్య, నిశబ్దం ఇవన్నీ మహా అయితే ఓ 30 కోట్ల స్టామినా ఉన్నవి. అది కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి హౌస్ ఫుల్స్ చేయిస్తేనే. కానీ ఇప్పుడా గ్యారెంటీ లేదు. రెవిన్యూ అంత ఆశిస్తే కష్టం . మరి థియేటర్లను లీజుకు తీసుకున్న ఎగ్జిబిటర్లు, ఓనర్ల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అదనపు భారాన్ని షేర్ చేసుకోవాలా లేక ఒకరే భరించాలా అనే దీని మీద భవిష్యత్తులో వివాదాలు తలెత్తినా ఆశ్చర్యం లేదు.

ఇప్పటికే కొన్ని వందల థియేటర్లు అగ్ర నిర్మాతలు లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. రెండు నెలలకు పైగా ఇవన్ని భారంగా మారాయి. లాక్ డౌన్ అయ్యాక అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకునే ఆలోచన కూడా కొందరు చేస్తున్నారట. సింగల్ స్క్రీన్ యజమానులు ఇప్పటికే తమ హాళ్ళ కొనసాగింపుపై తీవ్ర చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. మరోవైపు హింది, తమిళ్ తరహాలో ఇక్కడా ఓటిటి వైపు మెల్లగా అడుగులు పడుతున్నాయి. నిశబ్దం, విలు రావోచ్చనే టాక్ కొద్దిరోజుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇన్ని కారణాలు ఉండబట్టే థియేటర్ల గేట్లు అంత సులువుగా తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. జూన్ గడిచాకే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కరోనా కంటే ముందే కుంటి నడక సాగిస్తున్న థియేటర్ల వ్యవస్థను ఈ వైరస్ కాలు విరిగేలా దెబ్బ కొట్టిందని, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఊహకందడం లేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.