iDreamPost
android-app
ios-app

సావిత్రి కథకు జై – జయ స్టోరీకి నై

  • Published Sep 13, 2021 | 9:51 AM Updated Updated Sep 13, 2021 | 9:51 AM
సావిత్రి కథకు జై – జయ స్టోరీకి నై

భారీ అంచనాలతో ఊరించే ఓటిటి ఆఫర్లను వద్దనుకుని మరీ వచ్చిన తలైవికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్వాగతం దక్కలేదు. తెలుగులో కనెక్టివిటీ సమస్య అనుకుంటే అటు తమిళనాడులోనూ వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. కంగనా రౌనత్, అరవింద్ స్వామి, సముతిరఖని లాంటి గొప్ప ఆర్టిస్టులు అద్భుతంగా నటించినప్పటికీ అది జనాన్ని థియేటర్లకు రప్పించలేకపోతోంది. కలెక్షన్లు చూసి ట్రేడ్ బెంబేలెత్తిపోతోంది. జయలలిత బయోపిక్ గా కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినీ కం పొలిటికల్ డ్రామా గతంలో వచ్చిన సావిత్రి కథ మహానటి స్థాయిలో ఎందుకు మెప్పించలేకపోయిందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ కారణాలు చూద్దాం.

మహానటిలో సావిత్రి జీవితకథను నాగఅశ్విన్ చాలా నిజాయితీగా చెప్పాడు. ముఖ్యమైన విషయాలన్నీ దాచకుండా చూపించాడు. తాగుడు వ్యసనం ఆవిడను ఏ స్థాయికి దిగజార్చిందో, నమ్మినవాళ్లు ఎలా మోసం చేశారో అన్నీ కళ్ళకు కట్టినట్టు వివరించాడు. కానీ తలైవిలో అది కొరవడింది. గ్రాండియర్ , విజువల్స్ కి లోటు లేకపోయినా అసలైన జయ కథలో ఆత్మను ఒడిసిపట్టడంలో దర్శకుడు విజయ్ పూర్తి సక్సెస్ కాలేకపోయాడు. ముఖ్యంగా వివాదాలు ఇష్టం లేదన్నట్టుగా జయలలితను ఎలివేట్ చేయడానికే ప్రాధాన్యం చూపించి ఆవిడలోని అంతో ఇంతో ఉన్న నెగటివ్ కోణాన్ని అస్సలు టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపూ వీరనారిగా ప్రొజెక్ట్ చేయడం తప్ప వివిధ పార్శ్యాలను స్పృశించలేదు

ఇదంతా ఒక ఎత్తు అయితే ఎంజిఆర్ జయలను అమర ప్రేమికులుగా చూపించాలన్న తాపత్రయం ల్యాగ్ ని పెంచేసింది. చాలా సన్నివేశాలు ఈ కారణం వల్లే సాగతీతకు గురయ్యాయి. రాజకీయంగా విడిపోవడానికి ముందు ప్రాణ స్నేహితులైన ఎంజిఆర్ కరుణానిధిల ట్రాక్ ని కనీస స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అందుకే నాజర్ లాంటి మల్టీ టాలెంట్ యాక్టర్ కూడా నిస్సహాయుడిగా మిగిలిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంగీతం అందించిన జివి ప్రకాష్ కూడా అంచనాలు అందుకోలేకపోయారు. మిక్కీ జె మేయర్ స్కోర్ మహానటికి ఎంత ప్లస్ అయ్యిందో గుర్తుందిగా. మొత్తానికి తలైవికి టికెట్ కౌంటర్ల దగ్గర ఓటమి తప్పలేదు

Also Read : తుగ్లక్ దర్బార్ రిపోర్ట్