iDreamPost
android-app
ios-app

మిషన్ బిల్డ్ ఏపి – బాబు చేస్తే ఒప్పు, జగన్ చేస్తే తప్పా?

  • Published May 15, 2020 | 11:22 AM Updated Updated May 15, 2020 | 11:22 AM
మిషన్ బిల్డ్ ఏపి –  బాబు చేస్తే ఒప్పు, జగన్ చేస్తే తప్పా?

గడచిన ఎన్నికల్లో చంద్రబాబు విదానాలకి , పనితీరుకి ప్రజలు కోలుకోలేని తీర్పు ఇచ్చినా, ఆయనలో మార్పు వచ్చినట్టు కనిపించడంలేదు. ఇంకా ప్రత్యర్ధి పార్టీలపై అవాస్తవం అభూతకల్పనలతో కూడిన అవే ఆరోపణలు, అవే ప్రచారాలు. నిత్యం ఆన్ని ప్రభుత్వాలు అనుసరించే పద్దతిని కూడా దేశంలో ఎక్కడా జరగనట్టుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే చేస్తున్నట్టుగా, అది ఒక పెద్ద తప్పుగా ఎత్తి చూపే ప్రయత్నం చేయడం, దానికి అనుగుణంగా ప్రజలను నమ్మించడానికి అనుకూల పత్రికల్లో , మీడియా చానల్లో, సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ప్రచారం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయింది. ఆఖరికి ఇప్పుడు ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి , గతంలో ఆయనతో పాటు దేశంలోని అన్ని ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్నా , అది కూడా ఒక పెద్ద తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం చంద్రబాబుకే సాధ్యం అయింది.

విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆర్ధిక క్రమశిక్షణ పాటించక పోవడంతో రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. చివరికి ఆయన ముఖ్యమంత్రి గా దిగిపోయే సమయానికి రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్ళారు, గతంలో ఆర్ధిక మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడు గారు ఏకంగా జగన్ ప్రభుత్వానికి పైసా అప్పు పుట్టే పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం అప్పు మేమే తెచ్చేసాము అని బహిరంగంగా చెప్పారు. కాగ్ ఏకంగా రాష్టంలో అప్పులు ఆదాయం మద్య సమతుల్యత తప్పుతోంది అని హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం కాగ్ మాటలను పెడచెవిన పెట్టి ప్రచారాలకే వేల కోట్లు కర్చు చేశారు.

ఇటువంటి సమయంలో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన జగన్ దుబారా ఖర్చుకు దూరంగా ఉంటూ , ఆర్దిక క్రమశిక్షణ పాటిస్తునే సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. అందులో భాగంగా లోటులో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి ఆర్ధికంగా గాడిలో పెట్టటానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు పాటించే విధంగానే రాష్ట్ర ఖజానాకు ధనం సమకూర్చే విధంగా “మిషన్ ఎపి బిల్డ్” పేరుతో ప్రభుత్వ భూములని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఎన్నో తరాలుగా పాడుపడిపోయిన పేదవారు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అత్యాదునిక కార్పోరేట్ స్థాయి పాఠశాలలుగా తీర్చి దిద్ధేందుకు , అలాగే రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. దీనికోసం మొదటిదశలో గుంటూరు , విశాఖలో ఉన్న కొన్ని ప్రభుత్వ స్థలాలను మే29న ఈ – ఆక్షన్ ద్వారా అమ్మి ప్రభుత్వానికి 208.62 కోట్లు సమకూర్చెలా ప్రణాళికలు రూపొందించారు.

అయితే తెలుగుదేశం పార్టి అధినాయకుడు నుంచి చోటా మోటా నాయకుల వరకు, జగన్ ప్రజల ఆస్తులని అమ్మేస్తున్నాడని. ప్రభుత్వ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది అని. జగన్ చేస్తున్నది దుర్మార్గపు చర్య అని వారి అనుబంద మీడియా, పత్రికలు, సామాజిక మాద్యమాల ద్వారా అర్ధ సత్యాలను ప్రచారం చేసి జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో అపోహలు కల్గించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జగన్ చేస్తున్నది తప్పుకాదని , గతంలో అన్ని ప్రభుత్వాలు చేసిన పనే అని వారికి తెలిసినా ప్రజల్లో ప్రభుత్వాన్ని , జగన్ ను పలచన చేయడమే ధ్యేయంగా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకుని వచ్చారు.

గతంలో 1995లో రామారావుని గద్దె దింపి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రపంచ బ్యాంకు నుండి వేల కోట్లు అప్పు తెచ్చి, ఆర్ధిక లోటు పేరుతో విపరీతంగా కరెంటు బిల్లులు , పన్నులు పెంచి కూడా ఉద్యోగులకి జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోయారు. దీనికి ముఖ్య కారణం ఆ డబ్బులో అధిక శాతం ఆయన ప్రభుత్వ ప్రచారానికి వాడుకోవడమే, ఆ సమయంలో ఆయన ఆర్ధికలోటు పూడ్చాలనే వంక చెప్పి హైద్రాబాద్ , విశాఖ , విజయవాడ నగరాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ భవనాలు కూడా అమ్మకానికి పెట్టిన చరిత్ర ఉంది. అలాగే తాజాగా మొన్న జనవరి నెలలో చంద్రబాబు కు అనుకూలంగా ఉండే ఆంద్రజ్యోతి పత్రికలో కూడా చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులు అమ్మి హైద్రబాదులో రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించారు అని, ఆ విషయాన్ని తెలంగాణ ఉద్యమం సమయంలో కే.సి.ఆర్ తీవ్రంగా విమర్శించి ఇప్పుడు ఆయన కూడా పలు అభివృది కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వ స్థలాలు అమ్ముతున్నారని రాసుకొచ్చారు.

టీడీపీ ప్రభుత్వం తమిళనాడులో ఉన్న సదావర్తి భూములు అమ్మబోయినప్పుడు కూడా వైసీపీ అందులోని కుట్ర పూరితంగా తనవారికి కట్టబెట్టబోవటాన్ని ప్రశ్నించింది . అంతకన్నా అధిక ధర వస్తుందని తద్వారా ప్రభుత్వ ఖజానాకు మరింత లబ్ది చేకూరుతుందని పోరాడిందే కానీ ఇతర రాష్ట్రంలో నిరార్ధకంగా ఉన్న భూమి అమ్మి ప్రభుత్వానికి వెసులుబాటు కలిగించుకొనేందుకు అడ్డుపడలేదు. కర్నాటక ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు అభివృద్ది కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడనికి ఇటువంటి చర్యలు చేపట్టిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి.

తెలుగుదేశం నాయకుడు తన పాలనా హయాంలో అనుసరించిన విధానం , వారి ఆస్థాన పత్రికగా ముద్రపడ్డ ఆంద్రజ్యోతి పత్రిక ఆ విషయాన్ని దృవీకరించిన తరువాత కూడా జగన్ చేస్తున్నది తప్పు అని చెప్పడంలో తెలుగుదేశం రాజకీయ స్వార్ధమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. మన సమాజంలో మన కళ్ళ ముందే మనకు తెలిసిన వారే ఒకరు దుబారా ఖర్చుకు అలవాటు పడి ఆస్తులు అమ్ముకున్న వారు ఉంటారు , అలాగే కుటుంబ అభివృద్ది కోసం ఆస్తులు అమ్మిన వారు ఉంటారు. ఆనాడు చంద్రబాబు ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చి తన ప్రచారానికి అధిక ధనం వాడి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేక ప్రభుత్వ స్థలాలు అమ్మితే , నేడు ముఖ్యమంత్రిగా జగన్ చంద్రబాబు చిన్నాబిన్నం చేసి అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్ర పగ్గాలు చేపట్టి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పధంలో నడిపంచడానికి , అలాగే విద్యార్ధుల జీవన స్థితిగతులు మారేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ది చేయడానికి అన్ని ప్రభుత్వాల మాదిరిగానే పారదర్శకతతో మిషన్ బిల్డ్ ఏపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తెలుగుదేశం జగన్ పై విమర్శలు చెయడమే పనిగా పెట్టుకుని గతంలో తాము అవలబించిన పనులని కూడా తప్పు అనే చెప్పుకునే స్థాయికి ఆ పార్టీ పడిపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచెసే విషయం. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ది చేసి విద్యార్ధుల జీవన ప్రమాణాలు మార్చాలి అని చూస్తుంటే. ఆ విషయాన్ని కూడా తప్పు పట్టడం తెలుగుదేశం నేతలకే చెల్లింది. తాము ప్రభుత్వ స్థలాలు అమ్మిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా తొక్కిపెట్టి ముఖ్యమంత్రి జగన్ పై ఈ విషయంలో నిందారోపణ చేయడం హేయమైన చర్యగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు .