iDreamPost
iDreamPost
అప్పుడెప్పుడో ఎన్టీఆర్ దేవాంతకుడుతో మొదలుపెడితే విజయంసాధించిన తెలుగు సినిమాల చరిత్రలో యముడి పాత్రకు చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది. అది దశాబ్దాల పాటు కొనసాగింది. ఎందరో హీరోలు ముచ్చటపడి మరీ యముడి బ్యాక్ డ్రాప్ తో కథలు చేసి అద్భుతమైన సక్సెస్ లు అందుకున్నారు. యమగోల అప్పట్లోనే ఒక చరిత్ర సృష్టించింది. జనం తండోపతండాలుగా ఎగబడి మరీ యముడి వినోదాన్ని మనసారా ఆస్వాదించారు.
ఆ తర్వాత కొంత కాలానికి చిరంజీవి యముడికి మొగుడు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అందం హిందోళం లాంటి బ్రేక్ డాన్సు పాటలు, హీరో పాత్ర డ్యూయల్ రోల్ తరహాలో సాగే స్క్రీన్ ప్లే మేజిక్ వెరసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. సుమన్ యమ్ముడన్నకి మొగుడు పేరుతో కోట శ్రీనివాస రావు ప్రధాన పాత్రలో ట్రై చేశాడు కాని అదొక్కటే ఫెయిల్ అయ్యింది
ఆ తర్వాత కొన్నేళ్ళకే ఎస్వి కృష్ణారెడ్డి యమలీలది మరొక అధ్యాయం. ఏ హీరో ఇమేజ్ లేని ఆలిని పెట్టి పేలిపోయే కామెడీతో వచ్చిన ఈ చిత్రం హలో బ్రదర్, భైరవ ద్వీపం లాంటి అతిరధుల సినిమాల పోటీని తట్టుకుని మరీ చాలా చోట్ల వంద రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది. ఇప్పటితరంలో జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ రూపంలో మరో బంపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పాత కథకే రాజమౌళి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది.
కొంత గ్యాప్ తో ఎస్వి కృష్ణారెడ్డి యమలీల 2తో చేసిన ప్రయోగం వికటించింది. ఆ తర్వాత ఇప్పటిదాకా మన హీరోలు ఎవ్వరు యముడి జోలికి వెళ్ళలేదు. ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఫార్ములాగా నిలిచిన యముడిని సరిగ్గా వాడుకోవాలే కాని మళ్లి కాసులు కురిపించడం ఖాయం. కాకపోతే సరైన కథకులు దర్శకులు దొరకాలి