iDreamPost
android-app
ios-app

చంద్రబాబు సలహాలు లేకపోతే మోడి ముందుకు పోలేడా ? మొదలైన ఎల్లోమీడియా భజన!

  • Published Apr 15, 2020 | 4:08 AM Updated Updated Apr 15, 2020 | 4:08 AM
చంద్రబాబు సలహాలు లేకపోతే మోడి ముందుకు పోలేడా ? మొదలైన ఎల్లోమీడియా భజన!

ఏమో ఎల్లోమీడియా రాతలు చదువుతుంటే అందరికీ ఇలాగే అర్ధమవుతోంది. అసలు నరేంద్రమోడి-చంద్రబాబునాయుడు మధ్య అసలు ఫోన్ సంభాషణలు జరిగిందో లేదో కూడా సరిగా తెలీదు. మోడి తనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పుకోవటమే ఆధారం అంతే. సోమవారం రాత్రి మోడితో మాట్లాడేందుకు స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసింది వరకు వాస్తవం అయ్యుంటుంది. మరుసటిరోజు అంటే మంగళవారం ఉదయం మోడి తనకు ఫోన్ చేసినట్లు చంద్రబాబు చెప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కానీ మోడి కానీ ధృవీకరించలేదు.

ఇదే విషయాన్ని ఎల్లోమీడియా చాలా గొప్పగా ప్రచారం మొదలుపెట్టింది. మోడి-చంద్రబాబు మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయాలపై రాజకీయ వర్గాలన్నీ ఆరాతీస్తున్నాయట. నిజానికి ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ విషయంలో ఆసక్తి ఉంటుంది అనుకునేందుకు లేదు. ఎందుకంటే మోడికి దగ్గరవుదామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు, చంద్రబాబును మోడి దూరంగా పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాల గురించి ఎవరికుంటుంది ఆసక్తి ?

ఒకవేళ మోడి-చంద్రబాబు మాట్లాడుకున్నది నిజమే అయినా మహాఅయితే కరోనా వైరస్ గురించి తప్ప మరో విషయం మాట్లాడేందుకు మోడి కూడా ఆసక్తి చూపరన్న విషయం అందరికీ తెలిసిందే. సరే మాటల సందర్భంగా చంద్రబాబు చేసిన సూచనలన్నీ జగన్మోహన్ రెడ్డి నుండి కాపీ కొట్టినవే అన్న విషయాలు అందరికీ తెలిసిందే. 10వ తేదీ మోడితో మాట్లాడినపుడు జగన్ చేసిన రెడ్, ఆరెంజి, గ్రీన్ జోన్ల విభజన ప్రతిపాదననే నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు కూడా చేశాడు. దాన్ని ఎల్లోమీడియా బ్రహాండమంటూ భజన చేసింది.

మొదట జగన్ ప్రతిపాదన చేసినపుడేమో తప్పు పట్టిన ఇదే ఎల్లోమీడియా చంద్రబాబు సూచనకు మాత్రం బ్రహ్మాండమంటోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు బాగా చేస్తున్నారని మోడిని చంద్రబాబు అభినందించినట్లు ఎల్లోమీడియా భజన చేసింది. మోడికి దగ్గరవుదామని తపన పడుతున్న చంద్రబాబు అభినందించకుండా ఏమి చేస్తాడు. చంద్రబాబుకు మంచి పాలనానుభవం ఉందని, దార్శనికత ఉందని, ఆలోచనలేమైనా ఉంటే తనకు చెప్పాలని చంద్రబాబును మోడి కోరారట. చంద్రబాబు పాలనానుభవం, దార్శనికత గురించి మొన్నటి ఎన్నికల్లో స్వయంగా మోడినే బహిరంగసభల్లో చెప్పిన విషయాన్ని ఎల్లోమీడియా మరచిపోయిందేమో. మొత్తానికి చంద్రబాబు చాలా గొప్పోడని మోడి పొగిడినట్లు టముకు వేసుకోవటానికి ఎల్లోమీడియాకు చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది. ఇక చూసుకోండి మోడి భజనతో మోత మోగిపోతుంది.