iDreamPost
iDreamPost
ఓటీటీ పోటీ నుంచి బైటపడేందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లో విడుదలైన భారీ సినిమాలను పదివారల తర్వాతే, ఓటీటీకి ఇవ్వాలన్నది తేల్చేసింది. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించడానికి ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ లను నిలిపివేయాలన్నది నిర్మాతల మండలి నిర్ణయం. అందుకే తెలుగు ఫిల్మ్ చాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగ్గా, తుది నిర్ణయాన్ని మాత్రం కమిటీకి అప్పగించారు. అంతలోనే సీన్ మారింది. నిర్మాతల మండలే కీలక నిర్ణయాలను ప్రకటించింది. మొత్తం మీద ఓటీటీ నుంచి టెక్నీషియన్లు, టిక్కెట్ రేట్ల వరకు 8 అంశాలపై నిర్ణయాలను ప్రకటించింది.
మొత్తానికి ఓటీటీపై తుది నిర్ణయానికి వచ్చారు. భారీ బడ్జెట్ సినిమాలను 10 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలన్నది ప్రధాన నిర్ణయం. మరి మీడియం, చిన్న సినిమాల సంగతేంటి? రూ.6కోట్ల లోపు బడ్జెట్ ఉన్న సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వొచ్చు. కాకపోతే ఫెడరేషన్ లో చర్చించాక, బడ్జెట్ పరిమితి మీద నిర్ణయం తీసుకొంటారు.
సినిమాను ప్రదర్శించాలంటే వీపీఎఫ్ అంటే వర్చువల్ ప్రింట్ ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలన్నది మరో నిర్ణయం.
సినిమా టిక్కెట్ రేట్లు పెరిగి, మొత్తం థియేటర్ల మీద పెద్ద దెబ్బపడిన విషయాన్ని గమనించిన మండలి, రేట్లు తగ్గించాలని తుది నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ రేట్లు బాగా తగ్గించాలని, సామాన్యులకు అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. అందుకే టౌన్స్ లో రూ.100, సీ క్లాస్ సెంటర్లలో రూ.70 టిక్కెట్ రేట్లుగా నిర్ణయించారు. జీఎస్టీకూడా కలిపే ఈ రేట్లను ఫిక్స్ చేశారు.
మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలపి రూ.125 టిక్కెట్ రేటు అనుకున్నారు. మీడియం రేంజ్ సినిమాలకు టౌన్లలో రూ.100, సి సెంటర్లలోనూ రూ.100 రేటు ఉండాలని నిర్ణయించారు. పెద్ద సినిమాకైనా సరే మల్టీప్లెక్స్ లో అధికంగా రూ.150 ప్లస్ జీఎస్టీ మాత్రమే ఉండాలని తేల్చేశారు.
ఇక సినీకార్మికుల జీత భత్యాలపై ఛాంబర్, కౌన్సిల్ లు నిర్ణయం తీసుకోనున్నాయి. ఇప్పటిదాకా ఉన్న మేనేజర్ల వ్యవస్థను రద్దుచేయాలన్నది మరో నిర్ణయం.
షూటింగ్ లో కాలయాపనను తగ్గించడానికి, సమయపాలనను అమలు చేయాలన్నది మరో నిర్ణయం. అదే సమయంలో, తమ అసిస్టెంట్స్ కు, ఇతరులకు సౌకర్యాలను నటులు డిమాండ్ చేయకూడదు. అది వాళ్ల సొంత ఖర్చు మాత్రమే.