iDreamPost
iDreamPost
ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత పాఠాలు ఏమీ నేర్చుకొన్నట్టు కనపడలేదు . జరిగిన తప్పులు ఏంటి , ఎక్కడ పొరపాట్లు చేసాం , ప్రజల్ని ఎందుకు నమ్మించలేకపోయాం , ఓటర్లు నిర్ద్వంధ్యంగా ఎందుకు తిరస్కరించారు , ఇప్పుడు కర్తవ్యం ఏంటి , ప్రభుత్వ లోపాలేంటి , వాటిని ఎలా ప్రశ్నించాలి , ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి లాంటి కళ్లెదురుగా ఉన్న ప్రశ్నల్ని వదిలి గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఎదుర్కొన్న తీరుని పాఠ్యఅంశంగా తీసుకొని , జగన్ చేసినట్టే తీవ్రమైన ఆరోపణలు చేయటమే ప్రతిపక్ష పాత్ర అనుకొని అదే దారిలో తాము వెళ్తూ , తమ శ్రేణుల్ని తీసుకెళ్తున్నాం అనుకొని భుజాలు చరుచుకొంటున్న టీడీపీ తీవ్రమైన తప్పిదం చేసి ప్రతిపక్ష స్థానంలో ఉండే అర్హత కూడా కోల్పోతుంది .
నిజమే , జగన్ గత టీడీపీ ప్రభుత్వం పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసాడు , పలు ప్రజాసమస్యల పై అనునిత్యం రోడ్డెక్కి ధర్నాలు , ఆందోళనలు చేసాడు . టీడీపీ మేనిఫెస్టో హామీల అమలులో మోసం పై ప్రతిక్షణం ప్రశ్నిస్తూ వారికి పక్కలో బల్లెంలా మారి నిద్రలేకుండా చేసాడు . సామాన్య పరిభాషలో చెప్పాలంటే టీడీపీ మేనిఫెస్టోని అబద్ధాల పుట్ట అని చించి ఆరేశాడు .
ఆ దెబ్బతో అధికారం కోల్పోయిన టీడీపీ దిక్కుతోచక ప్రతిపక్ష విధులు తెలియక జగన్ నిర్ధేశించిన దారిలోనే నడవాలని నిర్ధేశించుకొన్నట్టు కనపడుతుంది . అయితే టీడీపీ చేసిన తప్పులు , హామీల వైఫల్యం జగన్ కూడా చేస్తే ఆ వ్యూహం ఫలించేదేమో కానీ టీడీపీలా హామీల అమలులో జగన్ మోసం చేయకుండా నిక్కచ్చిగా అమలు చేస్తున్నప్పుడు ఆ హామీల్లో లోపాలు ఎంచే ప్రయత్నం చేస్తూ వక్రభాష్యాలు లాగుతూ చేసే అబద్ధపు ఆరోపణలతో ప్రజల నమ్మకం పొందలేరన్న విషయం 40 ఏళ్ల అనుభవానికి తోచక పోవడం విశేషం . ఈ వక్రభాష్యాలకు పరాకాష్ట వైఎస్సార్ రైతు భరోసాలో జగన్ రైతుల్ని మోసం చేశాడని బాబూ , లోకేష్ ఆరోపించడం .
2017 వైసీపీ పార్టీ ప్లీనరీలో ఈ పథకాన్ని జగన్ ప్రకటించినప్పుడు అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుండి ప్రతి ఏటా 12500 చొప్పున నాలుగేళ్లలో 50000 పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పడం జరిగింది . ఇదే విషయాన్ని పలు సభల్లో , పాదయాత్రలో పేర్కొన్న జగన్ , వైసీపీ మేనిఫెస్టోలో సైతం నాలుగేళ్లలో 50000 ఇస్తామని స్పష్టంగా పొందుపరిచారు .
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రుణమాఫీ నాలుగు , ఐదు విడతలు ఇవ్వకపోవడం , పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఇక్కట్లపాలవుతున్న రైతుల్ని ఆదుకునే ఉద్దేశ్యంతో రెండో సంవత్సరం వరకూ ఆగకుండా మొదటి యాడాది నుండే అమలుపరిచారు . ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన పధకం కూడా కొంత చేయూత అయ్యింది . ఈ పధకం కింద కేంద్రం రైతుకి 6000 ఇస్తుండగా రాష్ట్రం 7500 కలిపి ముందుగా చెప్పినట్టు పన్నెండున్నర వెయ్యి కాకుండా 13500 ఇవ్వనారంభించింది . ఈ ప్రకారం ఐదేళ్లలో వైసీపీ చెప్పినట్టు 50000 కాకుండా 67500 అందించినట్టయ్యింది .
ఈ అంశాన్ని సాకుగా చూపుతూ చంద్ర బాబు , లోకేష్ విమర్శలు చేయసాగారు . వైసీపీ కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని ఇస్తూ రైతుల్ని 25000 మేర మోసం చేస్తోందని లోకేష్ విమర్శించగా , కాదు 30000 మేర మోసం చేసింది అని బాబు మరో ఆరోపణ చేశారు . వాస్తవానికి వైసీపీ నాలుగేళ్లలో ఇస్తానన్నది 50000 వేలు , ఇప్పుడు లబ్ధిదారులకు చెందుతున్నది 67500 అందులో కేంద్రం ఇచ్చిన 30000 పోగా రాష్ట్రం ఇస్తున్న భరోసా మొత్తం 37500 . అంటే జగన్ ప్రకటించిన 50000 లకు 12500 తక్కువ . మరి 25 వేలు తగ్గిందని లోకేష్ ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుతో లెక్కకట్టాడో అర్థం కాదు . 30000 తగ్గిందని బాబు 40 ఏళ్ల అనుభవం ఎలా బోల్తాపడిందో అర్థం కాకపోవచ్చు కానీ ప్రజలకు ఒక్కటి మాత్రం బాగా అర్ధమయ్యింది .
చెప్పిన ప్రతి హామీ అమలు చేస్తున్న జగన్ చివరికి కరోనా కష్టకాలంలో కూడా మాట తప్పకుండా హామీలు అమలు చేసేసరికి ఏమీ పాలుపోక అసంబద్దపు లెక్కలతో బురద చల్లే కార్యక్రమం చేపట్టారు అని ప్రజలు మాత్రం బాగా అర్థం చేసుకొన్నారు . ఇదే ఆరోపణకి కొనసాగింపుగా టీడీపీ అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ కింద ఐదేళ్లలో 75 వేలు , నాలుగు , ఐదు రుణమాఫీ విడతల కింద 40 వేలు వెరసి లక్షా పదిహేను వేలు లబ్ది చేకూరేదని తనకు ఓటేయక ఆ మేరకు ప్రజలు నష్టపోయారని బాబు వ్యాఖ్యానించారు .
ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆ వ్యాఖ్యని , ఆ వ్యాఖ్య చేసిన వ్యక్తిని ప్రజలు ఎంతవరకు విశ్వాసనిస్తారు అనే సోయి బాబుకి లేకుండా పోవడం బాధాకరం . తాను అధికారంలోకి రాగానే బేషరతుగా రైతుల రుణాలు అన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి , మొదటి సంతకం రుణమాఫీ పై అని చెప్పి ప్రమాణ శ్వీకారం రోజు అన్ని దారుల్లో బాబు వచ్చాడు రుణమాఫీ చేస్తున్నాడు అని ఫ్లెక్సీలు కట్టినాక వేదిక పై మొదటి సంతకం రుణమాఫీ పై కాకుండా రుణమాఫీ ఎలా చేయాలి , ఎవరికి చేయాలి , ఎంత మేరకు చేయాలి అనే విధి విధానాల పై కోటయ్య కమిటీని నియమించినప్పుడే ఆ క్షణమే సంపూర్ణంగా విశ్వసనీయత కోల్పోయి అధికారమిచ్చాక ఏమీ చేయలేం అన్న రైతుల నిట్టూర్పు అనుయాయుల చప్పట్ల హోరులో వినపడలేదు అనుకొంటా .
86000 కోట్లుగా ఉన్న వ్యవసాయ ఋణాల్ని బేషరతుగా మాఫీ చేస్తాం అన్న మాట మరిచి వివిధ ఆంక్షలతో 24000 కోట్లు మాత్రమే మాఫీకి యోగ్యమైన ఋణాలని నిర్ధారించి అవి ఐదు విడతల్లో ఇస్తాను , ప్రస్తుతానికి మీరు కట్టేసుకోండి అని యాడాది తర్వాత మీరు చెప్పేనాటికి అవి వడ్డీలతో తడిసి లక్ష కోట్లకు మోపెడయ్యాయి . చివరికి పలు కొర్రీలతో మూడు దఫాల్లో 14 వేల కోట్లు మాత్రమే తీర్చిన మీరు నాలుగు , ఐదు దఫాలు చెల్లించకుండా ఎన్నికల ముందు హడావుడిగా పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ప్రజలు మిమ్మల్ని మరోసారి నమ్మే సాహసం చేయలేదు .
అలాంటిది నాకు ఓటేసి ఉంటే నాలుగు ఐదు విడతలతో పాటు , అన్నదాత సుఖీభవ ఐదేళ్లు ఇస్తా ఒక్కొక్కరికి మొత్తం లక్షా పదిహేను వేలు ఇస్తా అంటే ప్రజలు ఎలా నమ్ముతారు బాబు .
ఇప్పటికైనా మీరు ఈ నిజాలు గ్రహించండి , ప్రజా సమస్యలు గుర్తించండి , వాటికై పోరాడండి . పోతిరెడ్డిపాడు లాంటి ప్రజాపయోగ కార్యక్రమాలకు రాష్ట్రానికి , ప్రజలకు అండగా నిలవండి . కనీసం ఓ మంచి ప్రతిపక్షంగా అన్నా మిగలండి . లేదు ఇదే పంథాలో అసత్య , అభూతకల్పనలతో ఆరోపణలు చేస్తూ మీ భుజాలు మీరే చరుచుకొంటారా మీ ఇష్టం కానీ ఈ దుచ్చర్యలు బూమ్ రాంగ్ అయ్యి టీడీపీ మరింత పతనం కావడానికి దారితీస్తాయి అనటంలో సందేహం లేదు.