తెలుగు బ్లాక్ బస్టర్లకు రీమేక్ డిమాండ్

గత ఏడాది లాక్ డౌన్ కు ముందు సంక్రాంతికి వచ్చి సరిలేరు నీకెవ్వరుతో పోటీ పడి మరీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించిన అల వైకుంఠపురములో హిందీ రీమేక్ కు సర్వం సిద్ధమయ్యింది. గత ఏడాదే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ ఇప్పుడు టైటిల్ తో సహా క్యాస్టింగ్ మొత్తాన్ని సెట్ చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్నారు. అక్కడా ఇదే స్థాయిలో విజయం దక్కుతుందనే ధీమాతో దర్శక నిర్మాతలు ఉన్నారు. బన్నీ రోల్ ని కార్తీక్ ఆర్యన్ పోషిస్తుండగా పూజా హెగ్డే స్థానంలో కృతి సనన్ మెరవనుంది. ఆది పురుష్ తర్వాత తనకు దక్కిన మరో భారీ ప్రాజెక్ట్ ఇది. లేట్ ఇన్నింగ్స్ లోనూ క్రేజీ ఆఫర్లు పట్టేసుకుంటోంది.

దీనికి షెహజాదా టైటిల్ ని ఫిక్స్ చేశారు. హీ రిటర్న్స్ హోమ్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. టబు పాత్రను మనిషా కొయిరాలా చేస్తోంది. భర్తగా రోనిత్ రాయ్ ఉంటాడు. విడుదల తేదీ 4 నవంబర్ 2022 అని ప్రకటించారు. ఎలాగూ ఏడాది టైం ఉంది కాబట్టి ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. షెహజాదాకు రోహిత్ ధావన్ దర్శకుడు. ఇతను గతంలో చేసిన సినిమాలు డిశుమ్, దేశీ బాయ్స్. రచయితగానూ బ్లాక్ బస్టర్స్ కు పని చేసిన అనుభవం ఉంది. ఇది ఎలాగూ రీమేక్ కాబట్టి అంతగా రిస్క్ ఫీలవ్వాల్సింది ఏమి లేదు. యధాతధంగా ఒరిజినల్ వెర్షన్ నే ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో తెలుగు రీమేకులు జోరందుకున్నాయి. షాహిద్ కపూర్ చేసిన జెర్సీ డిసెంబర్ రిలీజ్ కు రెడీ కాగా హిట్ ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. ఆరెక్స్ 100 రీమేక్ రేస్ లో పెట్టారు. కబీర్ సింగ్ సృష్టించిన రికార్డులు అందరికీ గుర్తే. క్రాక్ ని చేసేందుకు సల్మాన్ ఖాన్ ఉత్సాహం చూపిస్తున్నాడు కానీ ఒకవేళ అతను మిస్ అయితే అజయ్ దేవగన్ చేసే ఛాన్స్ ఉంది. ఉప్పెన హక్కులు అమ్మేసినట్టు సమాచారం. జాతిరత్నాలు కూడా హిందీలో రాబోతోంది. ఇలా మన బ్లాక్ బస్టర్లను ఏరికోరి మరీ అక్కడి నిర్మాతలు రీమేకుల కోసం ఎగబడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగిన టాలీవుడ్ కు ఇది శుభపరిణామమేగా

Also Read :  40 కోట్ల దసరా పందెం – విజేత ఎవరో

Show comments