40 కోట్ల దసరా పందెం - విజేత ఎవరో

By iDream Post Oct. 13, 2021, 02:30 pm IST
40 కోట్ల దసరా పందెం - విజేత ఎవరో

రేపటి నుంచి టాలీవుడ్ దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. గత వారం వచ్చిన కొండపొలం, ఆరడగుల బులెట్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడంతో మూవీ లవర్స్ దృష్టి పండగ సినిమాల మీదే ఉంది. రేపు మహా సముద్రం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ ని పక్కా ప్లానింగ్ తో సాగిస్తున్న యూనిట్ ఇప్పటికే మంచి హైప్ ని తెచ్చుకుంది, శర్వానంద్ సిద్దార్థ్ కాంబోతో పాటు ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి టేకింగ్ మాస్ లో ఆసక్తిని పెంచుతోంది. రిజల్ట్ పట్ల టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రేపు హాలీవుడ్ మూవీ వెనంతో పోటీ పడుతున్న ఈ యాక్షన్ కం లవ్ ఎంటర్ టైనర్ సుమారు 13.5 కోట్ల దాకా బిజినెస్ జరుపుకుంది.

ఇక ఎల్లుండి రిలీజవుతున్న వాటిలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద అక్కినేని అభిమానుల అంచనాలు మాములుగా లేవు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరిగిన ఈ చిత్రానికి ట్రైలర్ వచ్చాక హైప్ పెరిగింది. అంచనాలు ఓ మాదిరిగా అందుకున్నా చాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిల్ కు డీసెంట్ హిట్ వచ్చి పడుతుంది. దీనికి 18.5 కోట్ల బిజినెస్ చేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. శ్రీకాంత్ వారసుడు రోషన్ ని హీరోగా చేస్తూ గౌరీ రోణంకి దర్శకత్వంలో రాఘవేంద్రరావు పర్యవేక్షించిన పెళ్లి సందD మీద కూడా ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. 7.5 కోట్ల దాకా డీల్స్ చేసుకున్నారట.

మొత్తం కలిపి మూడు సినిమాలకు 40 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వెనంను పరిగణించలేం కానీ దానికీ అర్బన్ ప్రాంతాల్లో మంచి క్రేజ్ ఉంది. మల్టీప్లెక్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఇక రిపబ్లిక్, కొండపొలం లాంటి సినిమాలు సెలవు తీసుకోవాల్సిందే. లవ్ స్టోరీ కూడా రన్ పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉంది. ఇంకో రెండు వారాల్లో ఆహా వరల్డ్ ప్రీమియర్ జరగబోతున్న నేపథ్యంలో హాలుకు వచ్చే జనాలు క్రమంగా తగ్గిపోతారు. ఎలాగూ లాభాలు వచ్చేసి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయ్యారు. ఇక దసరా పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో ఎవరు వెనక్కు తగ్గుతారో వేచి చూడాలి. ఇంకో రెండు రోజుల్లో వీటి జాతకం తేలిపోనుంది.

Also Read : 'మా' కాష్టం ఎప్పటికి చల్లారుతుందో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp