iDreamPost
android-app
ios-app

తెలంగాణ లాక్‌ డౌన్‌.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌..

తెలంగాణ లాక్‌ డౌన్‌.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌..

ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణను లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య తెలంగాణలో 26కు చేరుకున్నాయని సీఎం చెప్పారు. ఒకరు మినహా అందరూ విదేశాల నుంచి వచ్చేవారని తెలిపారు.

1897 ఎపిడమిక్‌ ఎసెన్సియల్‌ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ చట్టం ప్రకారం అత్యవసర సేవలు మినహా అన్నింటిని బంద్‌ చేస్తున్నట్లు చెప్పారు. 31వ తేదీ వరకు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కూడా యజమానులు కూలి ఇవ్వాల్సిందేనన్నారు.

తెలంగాణలో 1.03 కోట్ల కుటంబాలు ఉండగా.. వీరిలో 87.59 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్‌కార్డులున్నాయని కేసీఆర్‌ చెప్పారు. వీరందరికీ నెల రోజులకు సరిపడా బియ్యం, ఇతర వస్తువుల కోసం 15 వందల రూపాయాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తామన్నారు. బియ్యం, 15 వందల ఆర్థిక సహాయం కోసం 2,415 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఐదుగురికి మంచి గూమికూడదన్నారు. నిత్యవసర వస్తువులు తెచ్చుకునేందుకు ఇంట్లో ఒకరు బయటకు వచ్చేందుకు అనుమతిస్తామన్నారు. ప్రస్తుతం ఎవరూ మనకు సహాయం చేయలేరని, మనకు మనమే సహాయం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ సరిహద్దులు మూసేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర వస్తువులైన కూరగాయలు, మందులు తీసుకొచ్చే రవాణా వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఆటోలు, ట్యాక్సిలు నిలిపివేస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.

అత్యవసర విభాగాల ఉద్యోగులకు మినహా ఇతర ఉద్యోగులందరికీ సెలవులు ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఇతర విభాగాల ఉద్యోగులు 20 శాతం మాత్రం హాజరవుతారని చెప్పారు. సెలవు రోజుల్లో కూడా ప్రభుత్వం పూర్తి వేతనం ఇస్తుందని చెప్పారు.