ఎట్టకేలకు వైజాగ్‌లో విజయం..

ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే అనే ఒత్తిడిలో విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు టీమిండియాని విజయం వరించింది.

మూడో టి20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (35 బంతుల్లో 57; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. అయితే 180 పరుగుల లక్ష్యం సఫారీలకు చిన్నదే. అంతా ఈ మ్యాచ్ కూడా పోతుందనే భావించారు.

కానీ లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. అనూహ్యంగా భారత బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ నాలుగు వికెట్లు, యజువేంద్ర చహల్‌ 3 వికెట్లు తీయడంతో సౌత్ ఆఫ్రికా కుప్పకూలి విజయం వరించింది. దీంతో టీం ఇండియాకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక నాలుగో T20 జూన్ 17న రాజ్‌కోట్‌లో జరగనుంది. మరి రాబోయే రెండు మ్యాచ్ లు కూడా గెలిచి కప్పు చేబడతారేమో చూడాలి.

Show comments