iDreamPost
android-app
ios-app

జగన్‌ పథకాలే కాపీ..! 2024 ఎన్నికలకు హామీలను సిద్ధం చేస్తున్న టీడీపీ..!!

జగన్‌ పథకాలే కాపీ..! 2024 ఎన్నికలకు హామీలను సిద్ధం చేస్తున్న టీడీపీ..!!

మన విధానాన్ని ప్రత్యర్థి పాటిస్తే.. అదే పెద్ద విజయం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయి. ప్రజలు వైసీపీ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలపై ఎంతో సంతృప్తితో ఉన్నారు. ఆయా పథకాలు ప్రారంభించిన సమయంలో వాటిని హేళన చేస్తూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నా.. ఆ తర్వాత ఆయా పథకాల ప్రాముఖ్యతను, ప్రజల్లో వస్తున్న ఆధరణను గుర్తించకుండా ఉండలేకపోతున్నారు. వైఎస్‌ జగన్‌సర్కార్‌ పథకాలనే రాబోయే ఎన్నికల్లో పేర్లు మార్చి.. పరిధి పెంచి అమలు చేసే విధంగా హామీలను టీడీపీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలవబోతున్నాయి.

100 గజాలు.. 3 లక్షలు..

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 గజాల్లో మూడు లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. 2024 ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నా.. ఇప్పుడే ఎందుకు ఈ మాట చెప్పారనేది సులువుగానే అర్థమవుతుంది. పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. పట్టాభిరాం ద్వారా టీడీపీ అధినేత ఈ మాటలు పలికించారని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేద, మ:ధ్యతరగతి వారికి పల్లెల్లో 72 గజాలు, పట్టణాల్లో 48 గజాలు (ఒక సెంటు) చొప్పున ఇళ్ల స్థలం కేటాయించిన జగన్‌ సర్కార్‌.. అందులో 1.80 లక్షల రూపాయలతో ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వబోతోంది. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీని పూర్తి చేసిన జగన్‌ సర్కార్‌.. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 32 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు దక్కాయి. మరో ఏడాదిన్నరలో సొంత ఇంటి కలను జగన్‌ సర్కార్‌ సాకారం చేయబోతోంది. ఈ పథకం ఏ స్థాయిలో విజయవంతం అయిందో.. పట్టాభిరాం చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. పంచాయతీ ఎన్నికల్లో గంపగుత్తగా వైసీపీకి ఓట్లు పడతాయనే భయంతో.. తాము అధికారంలోకి వస్తే.. 100 గజాలలో 3 లక్షల రూపాయలతో ఇళ్లు కట్టించి ఇస్తామనే హామీని చెప్పారని స్పష్టంగా తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌ తరహా టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను.. మళ్లీ అధికారంలోకి వస్తే ఇస్తామనే హామీని ఇవ్వకుండా.. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమలు చేసే పథకాన్ని తాము మరింత ఎక్కువ మొత్తంలో ఇస్తామని టీడీపీ నేతలు చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం.

ప్రజలెలా నమ్ముతారు..?

టీడీపీ ఇచ్చే హామీలను నమ్మే స్థితిలో ఏపీ ప్రజలు లేరు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. ఆ తర్వాత వాటి అమలు చేసిన తీరు.. ఇప్పటికీ ఏపీ ప్రజలు మరచిపోలేదు. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన హామీలలోని కొన్నింటిని ఇటీవల పంచాయతీ ఎన్నిలక కోసమంటూ టీడీపీ అధినేత విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ ఉన్నాయి. నాడు ఐదేళ్ల అధికారంలో వాటిని అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే.. చేస్తామంటూ చెప్పడంపై ప్రజలు నవ్వుకుంటున్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షితమైన తాగునీరు ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే హామీ ఇవ్వడంతో.. అప్పుడు చేయకుండా ఏమి చేశారనే ప్రశ్న ప్రజలు సంధిస్తున్నారు. ఇప్పుడు పట్టాభిరాం చేత పలికించిన మాటలు.. కూడా ఓట్ల కోసమే చేసినవేనని ప్రజలకు తెలియంది కాదు. అయినా టీడీపీ నేతల ఆశగానీ.. ఎప్పుడో అధికారంలోకి వస్తే.. ఇస్తామనే హామీని ప్రజలు నమ్ముతారా..? ఇప్పుడు ఇళ్ల స్థలం, ఇళ్లు కట్టించి ఇస్తున్న వారిని విశ్వసిస్తారా..? ఒక విషయం మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. 2024 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న పథకాలే ఉంటాయనడంలో సందేహం లేదు. కాకపోతే వాటి పేర్లు, పరిధి మారతాయంతే.