iDreamPost
android-app
ios-app

విచ్చలవిడిగా పచ్చబ్యాచ్‌ మైండ్‌ గేమ్‌

  • Published Mar 03, 2022 | 6:31 PM Updated Updated Mar 03, 2022 | 8:11 PM
విచ్చలవిడిగా పచ్చబ్యాచ్‌ మైండ్‌ గేమ్‌

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని పచ్చదండు మైండ్‌గేమ్‌కు తెరతీసింది. ఇక మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదన్నట్టు, అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి తీరాలన్నట్టు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. తీర్పురావడం తరువాయి అమరావతి రైతుల సంబరాలు, ఆనందోత్సాహాలు అంటూ హడావిడి చేశారు. మరోపక్క టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశమై హైకోర్టు తీర్పును స్వాగతించింది. ఇంకోపక్క రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు షరీఫ్‌, యనమల, ధూళిపాళ్ల, పత్తిపాటి పుల్లారావు,  సీపీఐ నేత రామకృష్ణ, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు వంటి వారు దీనిపై వెంటవెంటనే స్పందించేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినట్టు, అంతిమ విజయం అమరావతి రైతులకు దక్కినట్టు ప్రకటనలు ఇచ్చేశారు. పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వం ఇక అప్పీల్‌కు వెళ్లవద్దని కూడా సూచించేశారు. ఇక పచ్చ మీడియా అయితే అదేపనిగా ఈ వార్తలతో జనాన్ని ఊదరగొట్టేస్తోంది.

జనాన్ని నమ్మించాలని, ప్రభుత్వ స్థైర్యం దెబ్బతీయాలని..

ఇల్లు అలకగానే పండగ అన్నట్టు.. హైకోర్టు తీర్పు వెలువడగానే ఈ విధంగా టీడీపీ అండ్‌ కో విస్తృత ప్రచారం చేయడం ఒక ముందస్తు వ్యూహంగా కనిపిస్తోందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని జనాన్ని నమ్మించాలనేది ఆ వ్యూహం లక్ష్యం. ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయిలో పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం చేస్తే ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచవచ్చనేది వారి ఉద్దేశం. తమ ముప్పేట దాడితో ప్రభుత్వం బెదిరిపోయి కొత్తగా మూడు రాజధానుల బిల్లు తీసుకురావడానికి వెనుకంజ వేస్తుందని ఆశ పడుతున్నారు. అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నవారే ఈ ప్రచారం చేస్తున్నారని, అక్కడి రైతులంటేనే టీడీపీ అండ్‌ కో బినామీలు అన్న సంగతి రాష్ట్రంలో అందరికీ తెలిసిందేనని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.

మూడు రాజధానులకే కట్టుబడ్డ ప్రభుత్వం

రాజధాని పేరిట నిర్వహించాలనుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని అరికట్టడం. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు కూడా. మరింత పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లడమా, కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడమా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈలోపు తన పచ్చ రచ్చతో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి టీడీపీ బృందం ప్రయత్నిస్తోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. వీరి గిమ్మికులకు ప్రభుత్వం మోసపోదు. రైతుల ముసుగులో రాజకీయ నేతలు చేసే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని తమ ప్రభుత్వం సమ్మతించదని, ప్రజా ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందని చెబుతున్నారు.