iDreamPost
android-app
ios-app

ఎన్నికల కమీషనర్ కనగరాజ్ పై విష ప్రచారం – ఏది నిజం ?

  • Published Apr 12, 2020 | 12:33 PM Updated Updated Apr 12, 2020 | 12:33 PM
ఎన్నికల కమీషనర్ కనగరాజ్ పై విష ప్రచారం – ఏది నిజం ?

మతాన్ని రాజకీయాన్ని వేరు చేస్తేనే ఈ దేశం అభ్యుదయం వైపు అడుగేస్తుంది అని చెప్పాడు విప్లవ వీరుడు సర్ధార్ భగత్ సింగ్, కానీ ఆ మహనీయుడు ఈ మాట చెప్పి 90ఏళ్ళు గడుస్తున్నా ఇంకా మన రాష్ట్రంలో కొంతమంది కుహానా మేదావి వర్గం మాత్రం ప్రజలకు మతం అనే మత్తు నింపి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అధికారం కోసం మతతత్వ రాజకీయాలు చేయడానికి కూడా ఈ వర్గం వెనకాడదు అని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. నాడు ప్రజల మద్దతుతో బలమైన శక్తిగా మారిన వై.యస్ పైనా నేడు అదే స్థాయిలో ప్రజా మద్దతు ఉన్న వై.యస్ జగన్ పైనా తెలుగుదేశం ఎక్కుపెడుతున్న బాణం మతం.

జగన్ తిరుపతి వెళ్ళినా , జగన్ పీఠాధిపతులను కలిసినా , జగన్ పుష్కరాల్లో పాల్గొన్నా , జగన్ దర్గాకెళ్లినా జీర్ణించుకోలేని తెలుగుదేశం వాటి అనుబంద పత్రికలు జగన్ మతాన్ని గుర్తు చేసే ప్రయత్నం పదే పదే చేస్తుంటాయి. ఇక అరోపణలు , అభూత కల్పనలతో తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా అబద్దాలని పుట్టించి జగన్ పై ఒక మతం ముద్ర , ఒక కులం ముద్ర వేసి తనకి వున్న మద్దతుని తగ్గించాలనే విశ్వ ప్రయత్నం చేస్తునే ఉన్నాయి. ఈ ప్రయత్నానికి కొనసాగింపుగా తెలుగుదేశం సోషల్ మీడియా అందుకున్న సరికొత్త వాదం నూతనంగా నియమితులైన ఎన్నికల కమీషనర్ గా నియమితులైన వి.కనగరాజ్ గారిని , “జే” కనగరాజ్ అనే మరో వ్యక్తి ప్రొఫైల్ గా ప్రచారం చేస్తు , అతను ఒక బిషప్ అని మత ప్రచారకుడు అని అటువంటి వ్యక్తిని ఎలా ఎన్నికల అధికారిగా నియమిస్తారని సోషల్ మీడియా వేదికగా విషప్రచారాన్ని అందుకున్నాయి.

ఎవరీ కనగరాజ్?

నిజానికి తెలుగుదేశం ప్రచారం చెస్తున్న “జే” కనగరాజ్ , నేడు ఎన్నికల కమీషనర్ గా వచ్చిన “వి” కనగరాజ్ ఇద్దరూ వేరు వేరు వ్యక్తులు . వారి ఇద్దరి బయోడేటా చూస్తే, తమిళనాడులోని సేలం పట్టణంలో జన్మించిన వి.కనగరాజ్ ప్రాధమిక విధ్య అదే పట్టణంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పూర్తి చేసి హై స్కూల్ విద్య కోసం మద్రాస్ లోని సేంట్ పౌల్ కళాశాలలో చేరారు. 1969 లో మద్రాస్ లయోలా కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందిన అనంతరం లా చదువు మీద మక్కువతో మద్రాస్ లా కాలేజ్ లో చేరి 1972లో లా పట్టా పుచ్చుకున్నారు. 1973లో సేలం బార్ అసోషియేషన్ మెంబర్ గా లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టి, మద్రాస్ బార్ కౌన్సిల్ లో (M.B.C No 47/1973)గా నమోదు అయ్యారు .

24ఏళ్ళ పాటు న్యాయవాదిగా పనిచేసిన అనంతరం 1997 లో మద్రాస్ హై కోర్టుకు న్యాయమూర్తిగా భాద్యతలు స్వీకరించారు. తొమ్మిదేళ్ళు న్యాయమూర్తిగా బాద్యతలు చేపట్టిన కనగరాజ్ రికార్డు స్థాయిలో 69వేల కేసులకు తీర్పులు ఇచ్చారు. అందులో ఇంచుమించు 1010 కీలకమైన తీర్పులు లా జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 2002-05 మధ్య అంబేద్కర్ లా వర్సిటీలో సెనేట్ మెంబర్ గా పనిచెసిన కనగరాజ్ 2006 జనవరిలో జడ్జీగా పదవి నుండి తప్పుకుని సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఈ వి.కనగరాజ్ గారే ఆంద్ర రాష్ట్రానికి ఎన్నికల కమీషనర్ గా నియమితులయ్యారు .

ఇక తెలుగుదేశం ప్రచారం చేస్తున్న “జే” కనగరాజ్ తమిళనాడు తూతుకుడి జిల్లాలో మరవన్ మధం లో 1936లో జన్మించారు. లా కోర్సులో గ్రాడ్యుయేట్ అయిన “జే” కనగరాజ్ 1959లో మద్రాస్ హై కోర్టులో అడ్వకేట్ అయ్యారు. 1989లో అదనపు ప్రభుత్వ ప్లీడర్ గా భాద్యతలు చేపట్టిన “జే” కనగరాజ్ 1990 మార్చ్ నాటికి హైకోర్టు జడ్జి గా భాద్యతలు స్వీకరించారు. ఇక 2010లో తమిళ్ ఇవాంగలికల్ లూథరన్ చర్చ్ కి అడ్మినిస్ట్రేటర్ భాద్యతలు స్వీకరిచారు. అలాగే మద్రాస్ లో ఉన్న థామస్ ఎలిజబెత్ మహిళా కాలేజీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రం, వృత్తి, పేరు కలవడంతో సోషల్ మీడియాలో తెలుగుదేశం ,జనసేన సంయుక్తంగా పనికట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమితులైంది “జే” కనకరాజ్ అని ఆయన లూథరన్ చర్చ్ బిషప్ అని , జగన్ క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడానికే ఇతనిని నియమించారని రాజకీయ ప్రచారానికి తెరలేపి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇక “జే” కనగరాజ్ గా సోషల్ మీడీయా లో ప్రచారంలో ఉన్న ఫోటో కూడా ఆయన ఫొటో కాదు, అరుల్ దాస్ అనే బిషప్ ది. ఈ ప్రచారం లో పిసరంతైనా వాస్తవం లేకపోయినా ముఖ్యమంత్రి జగన్ పై బురదజల్లడమే ప్రధాన ఎజండాగా తెలుగుదేశం జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగం చేస్తున్న నీచమైన రాజకీయం మరో సారి బట్టబయలు అయింది.

ఇక సరికొత్తగా అరబిందో ఫార్మా డైరక్టర్లలో ఒకరైన గోవిందరాజన్ వియ్యంకుడు ఈ కనగరాజ్ అని మరొక విషప్రచారానికి తెరలేపారు, పరిశీలించి చూడగా ఇదికూడా పూర్తిగా అవాస్తవం అని తేలింది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఐదు ఏళ్ళ నుండి మూడు ఏళ్లకు కుదించడంతో వివాదాస్పద నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానంలోకి కొత్తగా అనేక సామాజిక సమస్యలపై అత్యుత్తమ తీర్పులు వెలువరించిన న్యాయ కోవిదుడు వి కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించడం హర్షనీయం…