Idream media
Idream media
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియతో రాజకీయాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఏ జిల్లాలో ఎవరికి పట్టు పెరుగుతుందో, ఎవరి ప్రాభవం మరింత తగ్గుతుందో తెలియజేస్తున్నాయి. ఎన్నికలలో పార్టీ గుర్తులు లేకపోయినా, వ్యక్తులు మాత్రం పార్టీ ముద్రతోనే ముందుకు సాగుతున్నారు. 2,723 పంచాయతీల్లో తొలి దశ ఎన్నికలు జరగగా.. 525 చోట్ల ఏకగ్రీవం కావడం తెలిసిందే. వారిలో 518 మంది వైసీపీ మద్దతుదారులే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు కొనసాగాయి. ఏకగ్రీవాల్లో ఈ దఫా ప్రకాశం జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 277 పంచాయతీలకు గాను 69 చోట్ల సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే అవన్నీ ఏకగ్రీవం అయినట్లే లెక్క. విశేషమేమిటంటో ఆ 69 స్థానాల్లో 66 చోట్ల వైసీపీ మద్దతుదారులే కావడం. ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న ఫ్యాను హోరును ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇక తొలి దశలో ఎన్నికలు పూర్తయిన పంచాయతీల్లో కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు 95 మంది విజయం సాధిస్తే.. టీడీపీ మద్దతు దారులు కేవలం 10 స్థానాల్లో మాత్రమే గెలిచినట్లుగా ఇప్పటి వరకూ వెల్లడైన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఈక్రమంలో ఓసారి ఆ జిల్లాపై లుక్కేస్తే..
ప్రకాశం జిల్లాలో మొ త్తం 12 అసెంబ్లీ స్థానాలుండగా 2014 ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలను టీడీపీ, ఆరు స్థానాలను వైసీపీ గెలుచుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురితో పాటు, చివరిక్షణంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల సిటింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఓటమి చవిచూశారు. టీడీపీ ఎమ్మెల్యేలలో అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండపి నుంచి డి.ఎస్.బి.వి.ఎన్. స్వామి, పర్చూరులో ఏలూరి సాంబశివరావు తిరిగి గెలుపొందారు. వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి, ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గిద్దలూరు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ తర్వాత అత్యధిక మెజారిటీని సాధించారు. ఆయనకు 78,568 ఓట్ల ఆధిక్యత లభించింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొంది అనంతరం టీడీపీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ ఈసారి అదేస్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది మంత్రిగా ఉన్న శిద్దా రాఘవరావు ఈసారి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. మాగుంట పార్టీ మారడంతో చంద్రబాబు శిద్దాను రంగంలోకి దించారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి దాదాపు 2 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అంటే 2014 నుంచే ప్రకాశం జిల్లాలో వైసీపీ హవా పెరిగింది. ఇక్కడ ఎక్కువ స్థానాలను వైసీపీ గెలుచుకోవడమే కాదు.. గెలిచిన అభ్యర్థులలో కొందరు అత్యధిక మెజార్టీ సాధించారు.
2019 ఎన్నికల నాటి నుంచీ ప్రకాశంలో సీన్ పూర్తిగా మారిపోయింది. గతం కంటే తెలుగుదేశం పరిస్థితి మరింత దిగజారింది. వైసీపీ స్థానాలను పెంచుకుంది. 12 అసెంబ్లీ స్థానాలుండగా వైసీపీ 8 చోట్ల, టీడీపీ అభ్యర్థులు నాలుగుచోట్ల గెలుపొందారు. అయితే రాష్ట్రమంతా హై స్పీడులో వీచిన ఫ్యాను గాలిలోనూ జిల్లాలో తెలుగుదేశం 4 స్థానాలను పొందడం ఇక్కడ ఆ పార్టీకి కొంత ఆదరణ ఉందనే చెప్పొచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ పూర్తిగా మారిపోయింది. పేరున్న నేతలందరూ ఒక్కొక్కరూ టీడీపీని వీడడం మొదలెట్టారు. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీ గూటికి చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేలు కదిరిబాబురావు, పాలేటి రామారావు తదితరులు వైసీపీలో చేరారు. గతంలో స్థానిక ఎన్నికల వాయిదా అనంతరం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారాయి. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే మరో టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా తన కుమారుడితో సహా వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది.
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం సీనియర్ నేతలందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచే ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఉనికి కోల్పోయింది. ఇదే సందర్భంలో వైసీపీ మరింత బలపడింది. అధికార పార్టీలోకి చేరిన నేతలందరితోనూ వారి కేడర్ కూడా వచ్చేయడంతో తిరుగులేని పార్టీగా కొనసాగుతోంది. తాజాగా పంచాయతీ ఎన్నికల పోరు జిల్లాలో తెలుగుదేశం ఎదురీతను వెలుగులోకి తెచ్చింది. ఈ జిల్లాలో 277 పంచాయతీలకు గాను 69 స్థానాలలో నామినేషన్ వేయడానికి కూడా తెలుగుదేశానికి అభ్యర్థులు దొరకలేదు. కొన్ని చోట్ల పోటీలో ఉన్నా అది పార్టీ ఇచ్చే ప్రోత్సాహకాల కోసమో.. పరువు కాపాడుకోవడానికే తప్పా.. మెజార్టీ స్థానాల్లో గెలిచే సత్తాలేదని తొలి విడత ఫలితాలను బట్టి తెలుస్తోంది.