iDreamPost
iDreamPost
కరోనా కలకలం తగ్గుతుందేమో గానీ ఏపిలో పొలిటికల్ రగడ చల్లారేలా లేదు. ఇప్పటికే సహాయక చర్యలు చుట్టూ సాగుతున్న రాజకీయం చాలా మందిని విస్మయానికి గురిచేస్తోంది. అందుకు తోడుగా ఇప్పుడు ఏకంగా ఆస్పత్రి సాక్షిగా రాజకీయాలకు తెరలేపడం విస్మయకరంగా మారింది. విశాఖ జిల్లా నర్సీపట్నం లో సాగుతున్న ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
నర్సీపట్నంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా సోమవారం విశాఖ అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ ఆధ్వర్యములో జిల్లా రూరల్ ఎస్పీ అట్టాడ బాపూజీ, ఇతర అధికారులు పాజిటివ్ కేసులు నివాసమున్న ప్రాంతం కోమటివీధిని పరిశీలించి, దానికి చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు.
అధికారులు మాట్లాడుతూ,తమిళనాడు నుంచి మత ప్రచారం నిమిత్తం గత నెల 18 న ఐదుగురు భార్యా, భర్తలు కలిసి నర్సీపట్నం వచ్చారన్నారు. వీరికి నర్సీపట్నంకు చెందిన ఇస్మాయిల్ తన నివాసానికి ఎదురుగా ఉన్న ఇంట్లో ఆశ్రయమిచ్చారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వీరిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ పది మందిని క్వారెంటైన్ నిమిత్తం విశాఖ ఛాతీ ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే పరీక్షలు నిర్వహించడంతో వీరిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించామన్నారు. ఈ అంశంలో స్థానికులు అప్రమత్తం కావడం వల్ల నర్సీపట్నంనకు పెను ప్రమాదం తప్పిందన్నారు. పరిస్థితి సద్దుమణిగే వరకు ఈ జోన్ నుంచి బయటకు రావడం కాని, అక్కడి వ్యక్తులు బయటకు వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. వీరికి అవసరమైన నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు అందిస్తారని చెప్పారు.
ఈ అంశంపై స్థానికంగా నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సుధాకర్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వివాదానికి మూలంగా మారాయి. ప్రభుత్వం మీద అయన చేసిన విమర్శలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. రోగులు, వైద్యుల బాగోగులు పట్టించుకోవడం లేదని ఆయన చేసిన విమర్శలు కలకలం రేపాయి.
దాంతో డాక్టర్ సుధాకర్ కామెంట్స్ పై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కౌంటర్ వీడియో విడుదల చేశారు. నర్సీపట్నం ఏరియా హాస్పటల్ లో అనస్థీషియా డాక్టర్ సుధాకర్ తీరుని తప్పుబట్టారు. ఆయన వివాదాస్పద వ్యక్తి అని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్ఠ్ లో ఏరియా హాస్పటల్ లో ఆపరేషన్ థియేటర్ లో ఆరుగురు గర్భిణీలకు ఎనస్తీషియా ఇవ్వకుండా మద్యలో వెళ్లిపోయిన చరిత్ర ఆయనకు ఉందన్నారు. కేవలం డాక్టర్ సుధాకర్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఆలా చేశారని విమర్శించారు. అదికారులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేసిన వ్యాఖ్యలు దురుద్దేశ్యంతో కూడినవి అన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రోద్బలంతోనే అయన ఈ విధంగా ప్రవర్తించారన్నారు . సమావేశానికి ముందుగా అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్ళిన సుధాకర్ అక్కడి నుంచి నేరుగా సమీక్ష నిర్వహిస్తున్న ప్రదేశానికి వచ్చి అక్కడ మీడియాతో మాట్లాడిన విషయాన్ని వీడియో ద్వారా బయటపెట్టారు. సీనియర్ నాయకుడు అయిన అయ్యన్నపాత్రుడు ఈ విధంగా చెయ్యడం సిగ్గుచేటు అన్నారు. నర్సీపట్నం రెడ్ జోన్ గా ప్రకటించినా తెలుగుదేశం నేతలు దిగజారి రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పందించారు. రోజూ 500 ఓపి లు ఉండే నర్సీపట్నం ఆస్పత్రి ప్రతిష్ట దిగజార్చే పని సరికాదని డి సి హెచ్ డాక్టర్ నాయక్ అన్నారు. డాక్టర్ సుధాకర్ తీరు మొదటి నుంచి అంతే అన్నారు. అనకాపల్లి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఆయన సస్పెండ్ అయ్యారని తెలిపారు. గతంలో విధులకు సమయానికి రావాలంటూ హెచ్చరించిన ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ పై దాడికి పాల్పడడంతో..ఆయనపై పోలీసులకి ఫిర్యాదు కూడా చేసిన విషయం గుర్తు చేశారు. ఆయన పై తోటి వైద్యులు నుంచి కూడా ఫిర్యాదు లు ఉన్నాయన్నారు. కష్టపడి పని చేస్తున్న వైద్యుల కృషిని నీరుగార్చే ప్రయత్నం తగదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నారో సీనియర డాక్టర్ సుధాకర్ కు తెలియనిది కాదు. ముఖ్యంగా సుధాకర్ రాజకీయంగా సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు 1983-2019 మధ్య ఒక్క ఐదు సంవత్సరాలు తప్పు మిగిలిన 31 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన నర్సీపట్నం నియోజకవర్గ కేంద్ర ఆసుపత్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదో ఏనాడు అడిగినట్లు లేరు.
కరోనా ప్రభావం ప్రబలటంతో ప్రభుత్వం ఆసుపత్రిలో సౌకర్యాల మీద దృష్టిపెట్టి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఐసోలేషన్ వార్డులో బెడ్లు , మందులు అందుబాటులో ఉంచామని ,ఎవరు ఆందోళన చెందొద్దని ఆసుపత్రి సూపర్నిడెంట్ డాక్టర్ నీలవేణి చెప్పారు. కానీ ఈ డాక్టర్ సుధాకర్ రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయటం శోచనీయం.
ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ ఆదేశాలకి విరుద్ధంగా పని చేస్తున్న అంశం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రాజకీయ లక్ష్యాలతో ప్రజలను అపోహలకు గురి చేయడం వివాదంగా మారింది. టీడీపీ నేతల తీరు కారణంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కూడా ఆటంకం కలుగుతున్న తీరు అలజడి రేపుతోంది. విపక్ష నేతలు తీరు మార్చుకోవాల్సిన అవసరం చాటుతోంది. అలాగే సుధాకర్ ఈ విపత్కర సమయంలో రాజకీయాలు వీడి డాక్టర్ గా చిత్తశుద్ధితో సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .