బుద్ధా వెంకన్నకు ఫ్రష్ట్రేషన్‌ తెప్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీలు

తెలుగుదేశంపార్టీ రెబల్‌ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఫ్రస్టేషన్‌ తెప్పిస్తున్నారు. సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానులు బిల్లులపై మండలి సమావేశాలకు హాజరకావాలంటూ టీడీపీ జారీ చేసిన విప్‌ను ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ధిక్కరించారు. అప్పటి నుంచి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ శాసన మండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చైర్మన్‌ పలుమార్లు విచారణ జరిపారు.

అయితే వ్యక్తిగత, ఆనారోగ్య కారణాలు చెబుతూ ఇద్దరు ఎమ్మెల్సీలు విచారణకు గౌర్హాజరవుతున్నారు. ఈ రోజు ఆరోసారి టీడీపీ ఫిర్యాదుపై మండలి చైర్మన్‌ విచారణ చేపట్టారు. ముందుగానే విచారణకు హాజరుకావాలని వారిద్దరికీ సమాచారం పంపారు. ఫిర్యాదు చేసిన టీడీపీ తరఫున ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, బుద్ధా వెంకన్నలు హాజరయ్యారు. అయితే ఈ సారి కూడా పోతుల సునీత, శివనాథరెడ్డిలు విచారణకు గౌర్హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేదంటూ వారు తమ తరఫున వారి న్యాయవాదులను పంపారు.

దీంతో బుద్ధా వెంకన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఎమ్మెల్సీలు ఇద్దరూ కావాలనే గౌర్హాజరవుతున్నారంటూ మండపడ్డారు. కుంటి సాకులు చెబుతూ విచారణకు రావడంలేదని చిర్రుబుర్రులాడారు. విచారణకు వస్తే పార్టీ మారినట్లు ఒప్పుకోవాల్సి వస్తుందనే వారు గౌర్హాజరవుతున్నారని విమర్శించారు. ప్రతి వాయిదాకు హాజరుకాకుండా లాయర్లను పంపడం సరికాదంటూ చెప్పుకొచ్చారు. వచ్చే వాయిదాలోనైనా చైర్మన్‌ తమ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటారని వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Show comments