చంద్రబాబు టూర్ కి పార్టీ నేతలే డుమ్మా?

మాజీ ముఖ్యమంత్రి సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై విశాఖపట్నంలో ప్రజాగ్రహం పెల్లుబికింది.. ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్యయాత్ర చేసేందుకు గురువారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు విశాఖ ప్రజలనుండి తీవ్ర నిరసన సెగ తగిలింది. విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్రలో పర్యటించబోమని ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు పెద్దఎత్తున రోడ్డుపై చంద్రబాబు కాన్వాయ్ కు అడ్డంగా రోడ్డుపై ఆందోళనకు దిగారు.ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేసారు. దాంతో చంద్రబాబు కొన్ని గంటలు విశాఖ ఎయిర్ పోర్టు బయటే నిలిచిపోయారు.

దాంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఒకానొక దశలో టీడీపీ, వైసీపీ శ్రేణులకు బాహాబాహీ జరిగింది. దాదాపుగా నాలుగు గంటలకు పైగా వాగ్వాదానికి దిగిన చంద్రబాబు ముందుకువెళ్లే అవకాశం లేకపోవడంతో పోలీసులు ఆయనను వీఐపీ లాంజ్ లోకి తరలించారు. అయితే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు టీడీపీ ప్రజా ప్రతినిధులు భారీగా డుమ్మా కొట్టారు. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, విశాఖ నార్త్ గంటా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఇతర జిల్లా టీడీపీ నేతలు పంచకర్ల రమేష్ బాబు, సబ్బం హరి, బండారు సత్య నారాయణ మూర్తి, వంగలపూడి అనిత కూడా ఈ ఆందోళనలో పాల్గొనలేదు. జిల్లా స్థాయి నేతలెవ్వరూ చంద్రబాబుకు మద్దతుగా ఎయిర్పోర్టుకు చేరుకోలేదు. కొద్దిమంది వచ్చినా వెనుకే ఉండిపోయారు.

సాధారణంగా పార్టీ అధ్యక్షుడు జిల్లాకు వస్తున్నారంటే కచ్చితంగా ఆహ్వానం పలికేందుకు జిల్లా పార్టీ నేతలంతా వస్తారు. ఒకవేళ అనివార్య కారణాలతో రాలేకపోయినా నాలుగున్నర గంటలపాటు ఎయిర్ పోర్టు వద్ద బాహాబాహీ జరిగిన సమయంలోనైనా వచ్చి సంఘీభావం తెలపవచ్చు. అలాకూడా చాలామంది నేతలు హాజరుకాలేదు. అలాగే ద్వితియశ్రేణి న్యాయకత్వం, జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నేతలు కూడా కనీసం ఫార్మాలిటీకైనా రాలేకపోయారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప సహా అతికొద్దిమంది మాత్రమే చంద్రబాబు వెంటఉన్నారు. అయితే కొద్దిరోజుల క్రితం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనను టీడీపీ వ్యతిరేకించినప్పటినుంచీ ఆపార్టీ నేతలు చంద్రబాబుతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

అయితే విశాఖ పరిసర ప్రాంతాలతోపాటు ఉత్తరాంధ్ర ప్రజానీకం మొత్తం జగన్ నూతన రాజధానుల ప్రకటనకు నీరాజనం పలికారు. చాలామంది టీడీపీ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి మరీ సీఎం నిర్ణయానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణబాబు నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలు సమావేశమై ప్రజలు రాజధానిని కోరుకుంటున్నారని, తమకు కూడా ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యమని చంద్రబాబుకు వివరించారట.. కానీ చంద్రబాబు మూడు రాజధానుల విషయంలో టీడీపీ నేతలు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని, పార్టీ స్టాండ్ ఫాలో అవ్వాలని చెప్పడంతో వారంతా కిమ్మనడం లేదు. ఎవరైనా ప్రజలు లేదా వైసీపీ నేతలు ప్రశ్నించినా ఎవరికివారు, మౌనంగా జారుకుంటూ వస్తున్నారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకిస్తే, స్థానికంగా వ్యతిరేకత తప్పదు.. అలాగని చంద్రబాబు మాటను జవదాటలేక పార్టీ స్టాండ్‌ను ఫాలో అవుతూనే పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఇప్పటివరకూ వచ్చారు. పార్టీ అధినేత విశాఖ వస్తే ఆయనకే పరిస్థితి అర్ధమవుతుందని ఆయన ప్రజలతో మాట్లాడి పార్టీ స్టాండ్ చెప్పగలిగినపుడు మనం కూడా ప్రజల్లోకి అదే స్టాండ్ తో వెళ్దామని భావించారు. కానీ ఇవాళ పరిస్థితి వేరేలా ఉంది.

అసలు జిల్లా పార్టీ నేతల సంగతి అటుంచితే నగర ఎమ్మెల్యేలైన వెలగపూడి రామక్రిష్ణ బాబు (విశాఖ ఈస్ట్), గణబాబు (విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు (విశాఖ నార్త్), వాసుపల్లి గణేష్ (విశాఖ సౌత్) ఈ నలుగురిలో గంటా ఒక్కరు మాత్రమే ధైర్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించారు.. మిగతా ముగ్గురూ రాజధాని అంశాలపై ఆచితూచి అడుగులు వేసారు. గంటామాత్రం బహిరంగంగానే మద్దతిచ్చారు. గతంలో అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సమయంలో కూడా తాను విశాఖను రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు చెప్పారు. ఎవరు ఏమనుకున్నా తాను విశాఖ రాజధాని రావడాన్ని సమర్ధిస్తానన్నారు. ఈ పరిణామాలతో గంటా సహా ఇవాళ డుమ్మా కొట్టినవారంతా కావాలనే చంద్రబాబు పర్యటనకు హాజరు కాలేదని అర్ధమవుతోంది. అయితే వీరిపై పార్టీ స్టాండ్ ను ఫాలో అవని కారణంగా చర్యలు తీసుకుంటారా లేదా మరోసారి రాజధానిపై విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి తమ పార్టీ స్టాండ్ ని వెనక్కి తీసుకుంటారా అనేది చూడాలి.

Show comments