iDreamPost
iDreamPost
ప్రపంచం తలకిందులు అయిపోతుందన్నారు..ఒక్క ఇంచు కదలించలేరన్నారు. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ కొంత అదుపు తప్పి మాట్లాడిన నేతలు కూడా ఉన్నారు. 33 రోజుల ఆందోళనతో హంగామా సృష్టించిన నేతలు చివరకు చల్లబడిపోయారు. అసెంబ్లీ ముట్టడిస్తాం..సభ సాగనిచ్చేది లేదన్నట్టుగా ప్రకటనలు చేసినప్పటికీ సర్కారు చర్యలతో సీన్ మారిపోయింది. రాజధాని ప్రాంతం మూడేళ్ల కిందటి కిర్లంపూడిని తలపిస్తోంది. శాంతిభద్రతల కోసమంటూ అప్పట్లో ముద్రగడ పాదయాత్రను అడ్డుకుని చంద్రబాబు ప్రభుత్వం ఏ తీరిన వ్యవహరించిందో..సరిగ్గా ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే విధానాన్ని అవలంభిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమంటూ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. అడుగడుగూ తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో చివరకు టీడీపీ నేతలు చెప్పినట్టుగా ఎటువంటి సీన్ లేకుండానే సామరస్య వాతావరణం కనిపిస్తోంది.
ఏపీ క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా కనిపించింది. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. అయితే పోలీసులు ఎక్కడిక్కడ ముందస్తు అరెస్టులకు పూనుకున్నారు. పలువురు టీడీపీ నేతలను అదుపు చేశారు. అంతేగాకుండా మందడం, వెలగపూడి వాసులకు కూడా నోటీసులు జారీ చేసి కట్టడి చేసే యత్నం చేసింది. ఈ పరిణామాలు కొంతమేరకు ఫలించినట్టు కనిపించాయి. నేతలంతా పోలీసుల అదుపులో ఉండడంతో సామాన్యులు సైతం ముందుకు రావడానికి సంసిద్ధంగా కనిపించడం లేదు.
అయినప్పటికీ ఏదో ఒక అలజడి రేపేందుకు విపక్ష క్యాంప్ నుంచి ప్రయత్నం సాగుతున్నట్టు కనిపిస్తోంది. నిఘా వర్గాలు అటువైపు దృష్టి సారించాయి. ఇప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న పరిస్థితిని కొనసాగించాలని యంత్రాంగం ఆశిస్తోంది. అయినప్పటికీ విపక్ష నేతలు కొందరు వ్యూహాత్మకంగా ఆందోళనలు సాగించాలనే లక్ష్యంతో ఉన్న తరుణంలో చివరకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది సస్ఫెన్స్ గా మారుతోంది.
ఇక క్యాబినెట్ లో ప్రభుత్వం తాను కోరుకున్న రీతిలో చేసిన నిర్ణయాలను అసెంబ్లీ ఆమోదం కోసం ముందుచుతోంది. ఇప్పటికే సీఆర్డీయే స్థానంలో అమరావతి మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ రీజియన్ గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇక అభివృద్ధి వికేంద్రీకరణకు తగ్గట్టుగా నాలుగు రీజియన్లు, మూడు రాజధానుల అంశంపై కూడా అసెంబ్లీలో ఆమోదం పొందే అవకాశం ఉన్న తరుణంలో మండలిలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలయ్యింది. ద్రవ్య బిల్లు కావడంతో మండలి నుంచి పెద్ద సమస్యలు ఉండవని పాలకపక్షం ఆశిస్తోంది.
కానీ టీడీపీ మాత్రం తొలుత బీఏసీలోనూ, ఆ తర్వాత మండలిలోనూ ఆటంకాలు సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే టీడీపీ ఆశలు నెరవేరే అవకాశాలు స్వల్పంగా ఉన్న తరుణంలో చివరకు ప్రభుత్వ ఎత్తులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ టీడీపీ చెబుతోంది. అమరావతి దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఇంకా అదే నినాదం ప్రమాదం అని గ్రహించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా అచ్చెన్నాయుడు, రామానాయుడు, బాలా వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్ తో పాటుగా చంద్రబాబు టీడీపీ తరుపున మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. సభలో వైసీపీ తరుపున జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి బలమైన గొంతు ఉన్న నేతలను సన్నద్ధమవుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ఆవశ్యతను వివరించే యత్నం చేయాలని చూస్తున్నారు. దాంతో అసెంబ్లీ వాడీవేడీగా సాగే ఛాన్స్ కనిపిస్తోంది.