Idream media
Idream media
‘‘పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపై ఎంత వీలైతే అంత నెగిటివ్ ప్రచారం చేయాలి.. అక్కడ అధికార పార్టీ నేతలు భూములు కొన్నట్లు ఆధారాలు లేకపోయినా నాలుగు రాళ్లు వేసేయాలి.. వైఎస్సార్‌సీపీ నేతలను ఎంత వీలయితే అంత ఘోరంగా తిట్టేయాలి. తమ ఆస్థాన పత్రికల్లో పతాక శీర్షికల్లో ఫొటోలతో అచ్చేంచుకోవాలి’’ ఇదీ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతల తీరు.
వారికి వాస్తవాలతో పనిలేదు. ఆధారాలు అసలే అవసరం లేదు. పొద్దున్నే విశాఖ వెళ్లి పార్టీ ఆఫీస్‌లో కూర్చొని రాసిపెట్టుకున్న స్క్రిప్ట్‌ను విలేకరులకు అప్పజెప్పి మధ్యాహ్నానానికి మళ్లీ అమరావతిలో దిగిపోతారు. దానికి మళ్లీ నిజనిర్ధారణ కమిటీ పేరిట పే…ద్ద ప్రహసనం. ఇలాంటి చౌకబారు ఆలోచనలు చేసి టీడీపీ నేతలు మరోసారి ప్రజల్లో చులకన అయ్యారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి టీడీపీ నేతలు తలా తోకా లేకుండా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ప్రజలను ఏమార్చడానికి ఎన్నో వేషాలు వేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతల దందాలు చేస్తున్నారంటూ విమర్శలు చేయడానికి నిజనిర్ధారణ కమిటీ అని చంద్రబాబు ఒకటి ఏర్పాటు చేశారు. అందులో టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు, పంచుమర్తి అనురాధ, నక్కా ఆనందబాబు తదితరులు సభ్యులుగా ఉన్నారు. వీరు పోయిన ఆదివారం విశాఖలో పర్యటించి నిజాలు తేల్చుతామంటూ వెళ్లిపోయారు. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సన్నిహితుడైన ప్రతాప్‌రెడ్డి భీమిలిలో రూ. 320 కోట్లతో 650 ఎకరాలు కొన్నారని, తగరపు వలస జ్యూట్ మిల్లు భూములను కబ్జా చేశారని, ఉమేశ్ అనే వ్యక్తిని బెదిరించి 50 శాతం వాటాలు కొట్టేస్తున్నారని ఏవేవో చెప్పారు.
ఇవన్నీ చెబుతున్నారు సరే.. ఇవన్నీ తేల్చడానికి వాళ్లు ఎక్కడ పర్యటించారు? ఆ భూములు ఎక్కడున్నాయో? వాటి వివరాలమిటో తెలుసా? ఎవరితో ఏ ఆధారాలు సేకరించారు? ఆ బెదిరింపులకు గురైన వ్యక్తిని కలిశారా? స్థానికుల అభిప్రాయాలు తీసుకున్నారా? అంటే అవేమీ అడగొద్దు. పార్టీ అధిష్టానం ఇచ్చిన స్క్రిప్టును అప్పజెప్పి వెళ్లిపోయారు అంతే.
ఇంకో గమ్మల్తైన విషయం ఏంటంటే.. నిజనిర్ధారణ కమిటీ సభ్యులు విశాఖ పర్యటనకు వస్తున్నట్లు అసలు స్థానిక నేతలెవరికీ తెలియదట. పొద్దునే విమానంలో విశాఖలో దిగిపోయి.. స్థానికంగా ఉండే రెండు మూడు పర్యాటక ప్రాంతాలు చూసేసి సాయంత్రానికి పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారట. టీవీల్లో వీరి ప్రెస్‌మీట్ చూసి అవాక్ అయిన స్థానిక నేతలు హుటాహుటిన పార్టీ ఆఫీస్‌కు చేరుకునే సరికి అక్కడ వీరు లేరు. విషయం ఏంటని ఫోన్ చేస్తే.. ప్రెస్‌మీట్ అయిపోంది.. ఇక మేము విజయవాడ వెళ్లడానికి విమానాశ్రయంలో ఉన్నామని చెప్పారట. దీంతో షాక్ అవడం ఆ స్థానిక నేతల వంతయింది.