iDreamPost
iDreamPost
డిజిటల్ మహానాడు రెండో రోజు గురువారం సీనియర్ నేత పిఆర్ మోహన్ పార్టీలోని లోపాలపై దుమ్ము దులిపేశాడు. వెబినార్లో మాట్లాడిన మోహన్ పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎన్టీయార్ పడిన కష్టాన్ని అందరికీ వివరించాడు. పనిలో పనిగా ఒకవైపు ఎన్టీయార్ ను పొగుడుతునే హఠాత్తుగా చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపాడు.
చంద్రబాబు చుట్టూ సతీష్ చంద్ర, రాజమౌళి, ప్రద్యుమ్నా, శ్రీనివాస్ ఓ వలయంలాగా ఏర్పడినట్లు ఆరోపించాడు. సతీష్ చంద్ర, రాజమౌళి, ప్రద్యుమ్న ఐఏఎస్ అధికారుల హోదాలో చంద్రబాబు కార్యాలయంలో పనిచేశారు. చంద్రబాబు హయాంలో వీరందరూ చక్రంతిప్పిన వాళ్ళే. వీళ్ళతో పాటు పిఏగా పనిచేసిన శ్రీనివాస్ గురించి చెప్పనే అక్కర్లేదు. టిడిపి హయాంలో సతీష్ చంద్ర, శ్రీనివాస్ చెలాయించన అధికారులకు ఆకాశమే హద్దంటూ పార్టీలోని నేతలే బాహాటంగా చెప్పుకునేవారు.
అదే విషయాన్ని పిఆర్ మోహన్ ప్రస్తావిస్తు పై నలుగురి వల్లే పార్టీ నేతలు, క్యాడర్ కు చంద్రబాబుతో దూరం పెరిగిపోయిందన్నారు.
ఎవరైనా నేతలకు చంద్రబాబు పదవులు ఇవ్వాలని అనుకున్నా పై ఇద్దరు పడనీయలేదంటూ ఆరోపించాడు. అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసిన ఎంతోమంది నేతలు, కార్యకర్తలకు ఎటువంటి పదవులు రాకుండా సతీష్ చంద్ర, శ్రీనివాస్ అడ్డుకున్నారంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. పిఆర్ ఆరోపణలతో ఒక్కసారిగా ఖంగుతిన్న చంద్రబాబు వారించాడు. అయితే చంద్రబాబు వారిస్తున్న వినకుండా తానను మాట్లాడనీయండంటూ పిఆర్ తాను చెప్పదలచుకున్నది చెప్పేశాడు. బహుశా చాలామంది నేతల మనస్సులోని మాటనే పిఆర్ చెప్పినట్లున్నాడు.
పార్టీ అధికారంలో ఉన్నపుడు బాగా డబ్బులు సంపాదించుకున్న నేతలు ఏరోజు పార్టీ పటిష్టత కోసం పనిచేయలేదన్నాడు. పదవులు రాకపోయినా, డబ్బులు సంపాదించుకునే అవకాశాలు రాకపోయినా పార్టీ కోసం కష్టపడింది క్యాడర్ మాత్రమే అన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలన్నాడు. పార్టీ ఓడిపోయినా ఇంకా మాజీ ఎంఎల్ఏలు, మంత్రులే ఇన్చార్జి హోదాలో అధికారం చెలాయించటాన్ని తప్పు పట్టాడు. ప్రతి నియోజకవర్గంలోను ఇన్చార్జిల స్ధానంలో ఐదుగురు సభ్యులతో కమిటిలు వేయాలంటూ సూచించాడు. పార్టీ అధికారంలో లేకపోయినా ఇన్చార్జిలు క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదంటూ మండిపడ్డాడు మోహన్. మొత్తానికి చంద్రబాబు ఎంత వారిస్తున్న వినకుండా పిఆర్ మోహన్ తాను అనుకున్నది చెప్పటం గమనార్హం.