Idream media
Idream media
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు.. ప్రతి ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన గాజు గ్లాస్ గుర్తు.. ఈ సారి నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కు దక్కడం తో.. జనసేన, బిజెపి నేతలు.. అధికార పార్టీ వైసీపీ ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. గుర్తుల కేటాయింపు లో వైసీపీ కుట్ర, వ్యూహం ఉందని, కేంద్ర ఎన్నికల సంఘం వద్దే తేల్చుకుంటామని జనసేన ప్రకటనలు చేస్తోంది. పోటీలోనే లేని జనసేన పార్టీ నిబంధనలు తెలుసుకోకుండా అధికార పార్టీ పై ఆరోపణలు, ఎన్నికల కమిషన్ మీద విమర్శలు చేస్తుండడం వారి అవివేకాన్ని మరోసారి బహిర్గతం చేస్తోంది.
ఉప ఎన్నికలో జనసేన పోటీలో లేదు. ఆ పార్టీ కేవలం రిజిస్టర్ పార్టీగా మాత్రమే ఎన్నికల సంఘం వద్ద నమోదై ఉంది. 2014లో స్థాపించిన జనసేన ఇంతవరకు గుర్తింపు పార్టీగా నమోదు కాలేదు. గుర్తింపు పార్టీగా నమోదు అయ్యేందుకు కావాల్సిన ఆరు శాతం ఓట్లు 2019 సాధారణ ఎన్నికల్లో జనసేన సాధించలేదు. దీంతో ఆ పార్టీకి శాశ్వత సింబల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించలేదు.
సాధారణంగా ఎన్నికల సంఘం.. రెండే నిబంధనల మేరకు అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తుంది. రిజిస్టర్ అయిన గుర్తులు, ఉచిత గుర్తులు అని మాత్రమే ఉంటాయి. రిజిస్టర్ అయిన పార్టీలకు రిజిస్టర్ గుర్తులను కేటాయిస్తుంది. ఇక ఉచిత గుర్తులను గుర్తింపులేని పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయిస్తుంది.
గుర్తింపు లేని పార్టీలు పోటీలో ఉంటే ఆయా పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులనే ఎన్నికల సంఘం ఇస్తుంది. ఒక వేళ పోటీలో లేకపోతే స్వతంత్రులకు కేటాయిస్తుంది.
Also Read : బీజేపీ కొంప ముంచనున్న గ్లాస్..!
తిరుపతి ఎన్నికకు వస్తే… ఒకే గుర్తును ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్ధులు తమకు కావాలని కోరితే.. రిటర్నింగ్ అధికారి లేదా ఎన్నికల అధికారి లాటరీ పద్ధతిలో గుర్తును కేటాయిస్తారు. లాటరీలో ఏ అభ్యర్థికి గుర్తు దక్కితే వారు ఆ గుర్తుపై పోటీ చేస్తారు. ఇందులో కుట్రకు తావెక్కడ ఉంది.
నవతరం అభ్యర్థి గోదా రమేషకుమార్ .. ఉచిత గుర్తుల్లో ఒకటిగా ఉన్న గాజు గ్లాస్ ని తనకు కేటాయించాలని కోరడంతో రిటర్నింగ్ అధికారి నిబంధనల మేరకే కేటాయించారు. ఇవేమీ తెలుసుకోకుండా జనసేన నాయకులు కొంతమంది తలతిక్క ఆరోపణలు చేస్తూ అబాసుపాలవుతున్నారు.
గుర్తు కేటాయింపులో వైసీపీ హస్తం ఉందని ఆరోపణలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఒక రాష్ట్ర పార్టీ జోక్యం చేసుకుంటుందా..? అసలు అలాంటి అవకాశం ఉంటుందా..? ఇలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసా..? ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే ఎలా..? ఇప్పటికైనా నిబంధనలు తెలుసుకొని మాట్లాడితే ఆ పార్టీతో పాటు నాయకులకు విలువ ఉంటుంది.
Also Read : తిరుపతి ఉప ఎన్నిక – గాజు గ్లాస్ గుర్తు పొందిన గోదా రమేష్ ఎవరు ?